టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ చిత్రం తాజా చిత్రం "నోటా". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో ఆయన ముఖ్యమంత్రి పాత్రను పోషించారు.
టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ చిత్రం తాజా చిత్రం "నోటా". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో ఆయన ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. పైగా, తమిళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. 'గీతగోవిందం' వంటి భారీ విజయం తర్వాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఎలా ఉందో ఓసారి తెలుసుకుందాం.
కథ :
ముఖ్యమంత్రి వాసుదేవ్ (నాజర్) తనయుడు వరుణ్ (విజయ్ దేవరకొండ). ఆడుతూ పాడుతూ జీవితాన్ని సరదాగా గడిపే ఓ కుర్రోడు. గ్రహాలు అనుకూలంగా లేవని ఒక స్వామీజీ చెప్పడంతో పాటు తనపై ఉన్న ఓ కేసు కోర్టులో ఉండటంతో రాత్రికి రాత్రే పదవి నుంచి దిగిపోయి, తన కొడుకు వరుణ్‌ని ముఖ్యమంత్రిని చేస్తాడు వాసుదేవ్. అసలు రాజకీయం అంటే ఏంటో తెలియని వరుణ్‌కి అప్పట్నుంచి వరుసగా సవాళ్లు ఎదురవుతుమంటాయి.
ఆపద్ధర్మ సీఎంగా కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాడని భావిస్తారు. కానీ, వరుణ్ పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. ఈ క్రమంలో తనకు ఎదురైన సవాళ్ల నుంచి ఎలా గట్టెక్కాడు. అసలు స్వామీజీకి, వాసుదేవ్‌కి మధ్య సంబంధమేమిటి. వాసుదేవ్ ఆడిన రాజకీయ క్రీడలో ఒక పావు మాత్రమే అనుకున్న వరుణ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఏం చేశాడు? అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ :
ఈ చిత్రం పూర్తిగా రాజకీయ నేపథ్యంతో కూడిన చిత్రం. దీంతో ఎత్తులు.. పై ఎత్తులు వంటి నాటకీయ పరిణామాలతో అత్యంత ఆసక్తికరంగా సాగుతుంటుంది. సహజంగానే ప్రజలు రాజకీయాల గురించి మాట్లాడుకుంటుంటారు కాబట్టి... చుట్టూ జరిగే పరిణామాలే తెరపై ప్రతిబింభిస్తుంటాయి. ఈ కథ కూడా అలాంటిదే. అయితే ఇందులో నాటకీయత లోపించింది.
వర్తమాన రాజకీయాల్ని ప్రతిబింభించేలా కథ, కథనాలు సాగినప్పటికీ... కథలోనూ మంచి అంశాల్నే స్పృశించినప్పటికీ అవి సినిమా మాధ్యమానికి... విజయ్ దేవరకొండ హీరోయిజం స్థాయికి తగ్గట్టుగా లేకపోవడంతో సన్నివేశాలు ఆశించిన స్థాయిలో పండలేదు.
ఈ చిత్రం తొలి అర్థభాగం వరకు ఫర్వాలేదనిపించినా.. ద్వితీయార్ధంలో సన్నివేశాలు మరీ చప్పగా సాగుతాయి. ప్రథమార్ధంలో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సవాళ్లు ఎదురవడం ఎప్పుడైతే ఆరంభమవుతాయో అప్పట్నుంచి కథ ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది.
విజయ్ దేవరకొండ శైలి, సన్నివేశాలు పండటం మొదలవుతుంది. అయితే ఆ జోరు చివరివరకు దర్శకుడు కొనసాగించలేక పోయాడు. అల్లర్లని అదుపు చేయడంకోసం ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు... మూడు రోజులు ఎవ్వరూ బయటికి రావొద్దంటూ అల్టిమేటం జారీ చేసిన విధానం అసలు సిసలు రాజకీయ డ్రామాని తలపిస్తుంది.
కానీ, ఆ తర్వాత నుంచే కథ గాడి తప్పినట్లు అనిపిస్తుంది. రౌడీ సీఎం వస్తున్నాడని చెప్పండి అంటూ విరామం సమయంలో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ ద్వితీయార్ధం వైపు ఆసక్తిగా చూసేలా చేసింది. అయితే, వరద ముప్పు నుంచి తప్పించడం వంటి సన్నివేశాల వరకు మాత్రమే ఎఫెక్టివ్‌గా అనిపించినా... ఆ తర్వాత సన్నివేశాలన్నీ సాదాసీదాగా అనిపించాయి. సరైన విలనిజం లేకపోవడం ఇందుకు కారణం.
స్వామీజీ పాత్రని ఉపయోగించుకోవల్సిన అవసరం ఉన్నా... దాన్ని వాడుకోలేదు. దాంతో పతాక సన్నివేశాలు ప్రేక్షకుల అంచనాలకి తగ్గట్టుగానే ముగుస్తాయి. రాజకీయ ప్రధానమైన కథ కాబట్టి కమర్షియల్ అంశాల జోలికి వెళ్లలేదు. తెలుగు రాజకీయ నేపథ్యం కంటే కూడా తమిళనాట పరిస్థితులే ఎక్కువగా తెరపై కనిపిస్తాయి.
ఎవరు ఎలా చేశారంటే..
విజయ్ దేవరకొండ తొలి అడుగుల్లోనే రాజకీయ ప్రధానమైన కథని చేయడం సాహసంతో కూడుకున్న పని. అయితే, ఈ కథని ఎంతగా నమ్మాడో ఆయన పాత్రలో ఒదిగిపోయిన విధానమే చెబుతుంది. తండ్రి చాటు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అంతే వాస్తవికతతో తెరపై కనిపించాడు. ప్రథమార్ధం వరకు ఆయన మార్క్, నడవడిక సినిమాకి బాగా కలిసొచ్చాయి.
మెహరీన్ పాత్ర గురించి, ఆమె నటన గురించి చెప్పుకోవల్సిందేమీ లేదు. అతిథి పాత్రని తలపిస్తుందంతే. సత్యరాజ్ పాత్ర సినిమాకి కీలకం. ఆయన యువ ముఖ్యమంత్రితో పాటు ఉంటూ కథని నడిపిస్తుంటాడు. నాజర్ అభినయం ఆకట్టుకుంటుంది. అయితే ద్వితీయార్ధంలో ఆయన మేకప్ మరీ చూడలేని విధంగా ఉంటుంది. ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టూనే ఈ కథ సాగుతుంది.
టెక్నికల్ : సినిమా ఉన్నత ప్రమాణాలతో నిర్మించారు. శంతన్ కృష్ణన్ కెమెరా పనితనం, శ్యామ్ సి.ఎస్ సంగీతం బాగుంది. రచన విషయంలోనే కాస్త తడబడినట్లు కనిపిస్తుంది. దర్శకుడిగా ఆనంద్ శంకర్ పనితీరు తొలి సగభాగం వరకే ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.
ఇకపోతే, ఈ చిత్రం బలం బలహీనతలను పరిశీలిస్తే విజయ్ దేవరకొండ నటన, చిత్రం తొలి అర్థభాగం కథను చెప్పుకోవచ్చు. బలహీనత గురించి పరిశీలిస్తే, కథనం, డ్రామాను పండించలేక పోవడం.