పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు.. సినీ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం టాక్‌ను కొందరు సూబర్బ్‌గా ఉందనీ పేర్కొంటే.. మరికొందరు తిరుగేలేదనీ అంటున్నారు. ఇంకొందరు మాత్రం ఫర్వాలేదు అని అంటున్నారు. అయితే, ఈ పబ్లిక్ టాక్ ఎలా ఉన్నప్పటికీ ఈ ఈ చిత్రం నెలకొల్పనున్న రికార్డుల గురించే సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.
నిజానికి పవన్ కల్యాణ్ సినిమా విడుదలవుతుందంటే.. బాక్సాఫీస్ వద్ద ఉండే సందడి అంతా ఇంతా కాదు. అభిమానులు, ప్రేక్షకులే కాదు. ట్రేడ్ వర్గాలు కూడా చాలా ఆసక్తిగా ఉంటాయి. పవన్ కలెక్షన్స్‌పరంగా ఎన్ని రికార్డులను నెలకొల్పుతాడనే లెక్కలు విడుదలకు ముందు నుండే మొదలవుతాయి. భారీ అంచనాలు మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'అజ్ఞాతవాసి'.
సాధారణంగా పవన్ సినిమా అంటేనే ఓ క్రేజ్ ఉంటుంది. మరి పవన్‌కు త్రివిక్రమ్తోడైతే ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'జల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాలు పెద్ద విజయాలను నమోదు చేసుకున్నాయని, ''అజ్ఞాతవాసి" కూడా సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం.
మరోవైపు అమెరికాలో 'అజ్ఞాతవాసి' థియేటర్లకు రాకుండానే రికార్డులు సృష్టిస్తున్నాడు. తొలి ఆట కూడా పడకుండానే అడ్వాన్స్ బుకింగుల్లో రికార్డు నమోదైంది. థియేటర్ల ఎదుట పవన్ అభిమానులు బారులు తీరారు. ‘అజ్ఞాతవాసి’ మేనియాతో ఊగిపోతున్నారు. సంక్రాంతి కానుకగా పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకు అభిమానులు నీరాజనాలు పడుతున్నారు.