Hari Hara Veeramallu: ఈసారి డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డులు మారతాయి : దర్శకుడు జ్యోతికృష్ణ

దేవీ

గురువారం, 3 జులై 2025 (15:01 IST)
dayakar, Jyothi Krishna, A.M. Ratnam, Nidhhi Agarwal
పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడిగా కనువిందు చేయనున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభించింది. తాజాగా విడుదలైన ట్రైలర్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి.
 
'హరి హర వీరమల్లు' ట్రైలర్ ను మూడు నిమిషాల నిడివితో రూపొందించారు. ట్రైలర్ లో అణువణువునా దర్శకత్వ ప్రతిభ కనిపించింది. దర్శకుడు జ్యోతి కృష్ణ చారిత్రక కథకు తగ్గట్టుగా చిత్రానికి భారీతనాన్ని తీసుకొచ్చారు. ట్రైలర్‌లో యుద్ధ సన్నివేశాలు, ముఖ్యంగా వీరమల్లు-మొఘలుల మధ్య యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. బలం మరియు శక్తికి చిహ్నంగా చిత్రాన్ని మలిచిన తీరు మెప్పించింది. అలాగే, వీరమల్లు పాత్రకు కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా, అందరూ ఆకర్షితులయ్యేలా తీర్చిదిద్దారు.
 
పంచమి పాత్రలో నిధి అగర్వాల్ చక్కగా ఒదిగిపోయారు. ఛాయాగ్రాహకులు జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస సన్నివేశాలను అందంగా చిత్రీకరించారు. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉండి, ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తోంది. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి తన అద్భుతమైన సెట్‌ లతో ప్రేక్షకులను మొఘల్ యుగంలోకి తీసుకువెళ్లారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి తన నేపథ్య సంగీతంతో ట్రైలర్ ను మరోస్థాయికి తీసుకెళ్ళారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ అద్భుతంగా ఉంది.
 
ట్రైలర్ ఆవిష్కరణ లో నిర్మాత ఎ. ఎం. రత్నం మాట్లాడుతూ.. "చరిత్రను గుర్తుచేసే సినిమా ఇది. పవన్ కళ్యాణ్ గారు చేసిన పూర్తిస్థాయి పాన్ ఇండియా యాక్షన్ చిత్రమిది. మీ ఆనందం చూస్తుంటేనే.. ట్రైలర్ మీ అంచనాలకు మించి ఉందని అర్థమవుతోంది. సినిమా ఇంతకుమించి ఉంటుంది. ఈ చిత్రం ఇంత అద్భుతంగా రావడానికి నా కుమారుడు జ్యోతికృష్ణ ఎంతగానో శ్రమించాడు. ఇప్పటిదాకా మీరు పవర్ స్టార్ ను చూశారు, ఈ సినిమాలో రియల్ స్టార్ ను చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు సినీ జీవితంలోనే కాదు.. నిజజీవితంలోనూ రియల్ హీరో." అన్నారు
 
నిర్మాత ఎ. దయాకర్ రావు మాట్లాడుతూ.. "ఇది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా జూలై 24న వస్తుంది. ఆరోజు అసలైన పండుగ జరుపుకోబోతున్నాం. ఇది మా టీం ఆరు సంవత్సరాల కష్టం. సినిమా అద్భుతంగా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి హృదయంలోనుంచి వచ్చే మాటలను ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుంది. మన చరిత్రను మనకు గుర్తు చేస్తుంది." అన్నారు.
 
దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. "కొందరు సినిమా గురించి అసత్య ప్రచారాలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. మా పని మేము చేసుకుంటూనే ఉన్నాము. ఎ. ఎం. రత్నం గారు ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కి ఎంత బడ్జెట్ పెట్టినా తక్కువే అనిపిస్తుంది. ఇండియా మొత్తం తిరిగి చూసేలా ఈ సినిమా ఉండబోతుంది. అప్పట్లో ఖుషి సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో మొదటి వంద కోట్ల సినిమా గబ్బర్ సింగ్. అది పవర్ స్టార్ అంటే. ఇప్పుడు మన సినిమాతో మరో భారీ విజయం సాధించబోతున్నాం. ఈ సినిమాకి పునాది వేసిన క్రిష్ గారికి ధన్యవాదాలు. అలాగే తన విలువైన సమయాన్ని కేటాయించి, మాకు అండగా నిలిచిన త్రివిక్రమ్ గారికి కృతఙ్ఞతలు. చివరిగా ఒక్క మాట. ఈసారి డేట్ మారదు.. ఇండస్ట్రీ రికార్డులు మారతాయి." అన్నారు.
 
కథానాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. "మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం." అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు