వామ్మో... నల్లకోటు ఓటుకు రూ.కోటి ఆఫర్

బుధవారం, 21 నవంబరు 2018 (08:55 IST)
సాధారణంగా ఎన్నికల్లో ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు రాజకీయ నేతలు నోట్ల వర్షం కురిపిస్తారు. ఒక్కో ఓటుకు కనిష్టంగా రూ.500 నుంచి గరిష్టంగా రూ.1000 వరకు ఇస్తారు. ఇది సాధారణ ఓటర్ల పరిస్థితి. 
 
కానీ, నల్లకోటు ఓటుకు భలే డిమాండ్ ఉంది. బార్ కౌన్సిల్‌ ఛైర్మన్ గిరికి జరిగే ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేసిన వారికి రూ.కోటి ఇస్తామంటూ బరిలో ఉన్నవారు ప్రచారం చేసినట్టు వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
నిజానికి ఎంతో విలువైన ఓటు అంటే ఇపుడు నోటు అన్నట్టుగా మారిపోయింది. అడిగిన వ్యక్తికే ఓటు వేయాలంటే నాకేంటి.. నాకెంత ఇస్తారంటూ పబ్లిక్‌గానే ఓటర్లు ప్రశ్నిస్తున్నాడు.
 
ఈ నేపథ్యంలో న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయ విభాగానికి కూడా ఈ నోటు జాఢ్యంపాకింది. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఛైర్మన్ పదవికి పోటీ చేసే అభ్యర్థికి ఓటు వేస్తే కోటి రూపాయలు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారంటూ ఓ వార్త న్యాయవాద వర్గాల్లో వైరల్ అవుతోంది. పైగా, ఈ ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఏకంగా ముఖ్యమంత్రికే పలువురు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. 
 
ఏపీ బార్‌ కౌన్సిల్‌కు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సుమారుగా 24 వేల మంది న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరంతా కలిసి 25 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. ఇపుడు ఈ 25 మంది సభ్యులు కలిసి కౌన్సిల్ ఛైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. 
 
దీంతో ఈ పదవికి భలే డిమాండ్ ఉంటుంది. కానీ, ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉన్నవారు మాత్రమే దీనికి పోటీ చేస్తారు. దీంతో ఈ పోస్టుకు పోటీపడుతున్నవారు తమకు అనుకూలంగా ఓటు వేస్తే రూ.కోటి ఇస్తామంటూ ఆఫర్ చేశారనే వార్త ఒకటి సోషల్ మీడియాలో‌ వైరల్ అయింది. 
 
వాస్తవానికి బార్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఎన్నికైన వారికి విశేషాధికారాలు ఉంటాయి. అందుకే ఇంత పెద్ద మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఓటుకు కోటి ప్రచారం జోరందుకోవడంతో కొందరు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసి, ఏసీబీతో విచారణ జరపాలని కోరుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు