టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరోమారు కమలనాథుల నుంచి పిలుపువచ్చింది. ఓసారి ఢిల్లీకి వస్తే కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుందామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి ఆయనకు కబురు వచ్చింది.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తనకు ఫోన్ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ నేతలతో చెప్పారు. ముఖ్యంగా, విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ సహా విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
అయితే, ప్రత్యేక హోదా గురించి మాత్రం మాట్లాడలేదని... ఇప్పుడు మనం ఏంచేద్దాం అని టీడీపీ నేతలను అడిగారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఢిల్లీలో ఉన్న ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ, అన్ని విషయాల్లో ప్రజలకు స్పష్టతను ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని చెప్పారు. ఇప్పుడు కేంద్ర మంత్రులను మనం కలిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని పలువురు వ్యాఖ్యానించారు. యనమల వ్యాఖ్యలతో చంద్రబాబు ఏకీభవించారు.