ఈ వారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని పలువురు ఎంపీలకు అధిష్టానం వ్యక్తిగతంగా సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అస్సాం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు ఎంపీలు హస్తినకు చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ తో ప్రధాని చర్చలు ఈ సాయంత్రం జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే మంగళవారం సాయంత్రం జరగాల్సిన మంత్రుల భేటీ రద్దైనట్లు తెలుస్తోంది. ఇక కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లోత్ ను కర్ణాటక గవర్నర్‌గా ప్రకటించడంతో కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ గంటల వ్యవధిలోనే అని తెలుస్తోంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల టీమ్ రెడీ!
2024 ఎన్నికలు లక్క్ష్యంగా ఈ విస్తరణ ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ సహా మొత్తంగా 54 మందితో ఉన్న మంత్రి మండలిలో మరో 25 మందిని చేర్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్వతంత్ర హోదా, సహాయ మంత్రి పదవి నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది.