డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధి అరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆయన ఆరోగ్యం పరిస్థితిపై ఏ క్షణమైనా వైద్యులు దుర్వార్తను వెల్లడించవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి ఆదివారం రాత్రే డీఎంకే చీఫ్ ఇకలేరనే వార్త వైరల్ అయింది. దీంతో చెన్నై నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే, సేలం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కూడా తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని రాత్రికి రాత్రే చెన్నైకు చేరుకున్నారు. దీంతో కరుణానిధి ఇకలేరని ప్రతి ఒక్కరూ భావించారు.
కానీ, ఆయన చికిత్స పొందుతున్న కావేరీ ఆస్పత్రి వైద్యులు ఒక వైద్య బులిటెన్ విడుదల చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యానికి ప్రమాదం లేదని తెలిపాయి. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, ఆరోగ్యం మెరుగవుతుందని బులెటిన్‌లో వైద్యులు తెలిపారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని ఆ తర్వాత వైద్య చికిత్సతో ఆయన కోలుకున్నారని అందులో పేర్కొన్నారు.
మరోవైపు, ఆయన కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, డీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున కావేరీ హాస్పిటల్‌కు తరలివచ్చారు. ఆయన ఆరోగ్యం విషమించిందని తెలియడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందారు. ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు చేరుకోవడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదిలావుంటే, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధికి ఇన్‌టెస్టినల్ కేన్సర్(అబ్డామినల్ కేన్సర్)తో బాధపడుతున్నట్టు సమాచారం. గత 2016 నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఈ రాజకీయ వృద్ధనేతకు ఇటీవల ఇన్ఫెక్షన్, జ్వరం కారణంగా ఆస్పత్రిలో చేరారు. అపుడు ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యల వల్లే ఆయన అనారోగ్యం పాలైనట్లు గుర్తించిన వైద్యులు ఆ మేరకు చికిత్స అందజేశారు. కానీ మూడు రోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరిన తర్వాత చేసిన పరీక్షల్లో కరుణకు అబ్డామినల్ కేన్సర్ ఉందని తేలినట్లు సమాచారం.