కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు. రెండింటిలోనూ విజయం సాధించిన జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి.. తన భార్యను రంగంలోకి దించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే గెలిచిన రెండు నియోజక వర్గాల్లో కుమార స్వామి చెన్నపట్టణ నియోజకవర్గాన్ని చేతిలో పెట్టుకుని, రామ్‌నగర్ నియోజకవర్గాన్ని వదిలేశారు. ఈ మేరకు రాజీనామాను సమర్పించారు.
తొలుత ఆయన చెన్నపట్టణ అసెంబ్లీని వదులుకుంటారని భావించినప్పటికీ, అక్కడ పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి సీపీ యోగీశ్వర్ బలమైన నేత కావడంతో, అతనికి మరో అవకాశం ఇచ్చే ఉద్దేశంలో కుమారస్వామి లేరని తెలుస్తోంది. అయితే ఇక మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నిక జరిగే రామ్ నగర్ నుంచి తన భార్యను బరిలోకి దింపాలని, ఇక్కడ కాంగ్రెస్ బలం కూడా తోడు అవడంతో ఆమె గెలుపు సునాయాసమేనని కుమారస్వామి భావిస్తున్నట్టు సమాచారం.
ఇకపోతే.. కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో.. సోషల్ మీడియాలో కుమార స్వామి భార్య ట్రెండింగ్ అవుతున్నారు. తమిళ, కన్నడ భాషల్లో 32 సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రాధిక గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
ఇప్పటికే గూగుల్ ట్రెండింగ్‌లో రాధికా కుమారస్వామి టాప్‌లో వున్నారు. తనకంటే 17ఏళ్ల చిన్నదైన రాధికను 2006లో పెళ్లాడారు. కాగా, వీరిద్దరికీ ఇది రెండో వివాహమే కావడం గమనార్హం. 1986లో అనితను వివాహం చేసుకున్న కుమారస్వామి, ఆ తరువాత ఆమెకు విడాకులిచ్చారు. అలాగే 2002లో రతన్ కుమార్‌ను పెళ్లాడిన రాధిక, ఆపై అభిప్రాయ బేధాలతో అతనికి దూరమయ్యారు. ప్రస్తుతం రాధిక సినీ నిర్మాతగా కొనసాగుతున్నారు.