రామోజీరావును ఎన్టీఆర్ చంపాల‌నుకున్నారు : నాదెండ్ల భాస్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

శనివారం, 5 జనవరి 2019 (20:36 IST)
రామోజీరావును చంపేందుకు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుట్ర పన్నారంటూ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నం అయ్యాయి. ఇటీవ‌ల‌ ఓ న్యూస్ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నాదెండ్ల భాస్క‌ర‌రావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కి విల‌న్స్ ఫ్యామిలీ మెంబ‌ర్సే. ఎందుకంటే.. ల‌క్ష్మీపార్వ‌తిని సీఎం చేస్తాడేమో అని. దీంట్లో రామోజీరావు గారి పార్ట్ కూడా ఉంది. రామారావుకు, రామోజీరావుకు మ‌ధ్య అనుబంధం చెడింది. ఎందుకు చెడింది అనేది చెప్ప‌లేను. ఎందుకంటే తెలియ‌దు అన్నారు.
 
శ్రీశైలం వెళ్లిన‌ప్పుడు స్వామివారి దర్శనం చేసుకుని గెస్ట్ హౌస్‌కు వెళ్లాను. శంక‌రాచార్యులు అక్క‌డ ఉన్నారు. నేను వెళ్లి క‌లిస్తే… నీ కోస‌మే చూస్తున్నాను రా.. అన్నారు. త‌లుపు వేసి లోప‌ల కూర్చోబెట్టి రామోజీరావును చంపేయబోతున్నాడు రామారావు. అంతా 20 రోజుల్లో అయిపోతుంది. అన్నీ రెడీ చేసేసారు. మీరిద్ద‌రు క‌లిసి పోవ‌చ్చు క‌దా. నేను మాట్లాడ‌తాను. రేపు రామారావు ఇక్క‌డ‌కు వ‌స్తున్నాడు అని చెప్పారు. అది ఎలా సాధ్యం అవుతుంది. ప్ర‌జ‌లు ఒప్పుకోరు.
 
ప్ర‌జ‌లు రెండుగా విడిపోయారు. నేను మంచోడు అన్నా.. చెడ్డోడు అన్నా ప్ర‌జ‌ల నుంచి రావాల్సిందే త‌ప్పా మామూలుగా రాదు. ఇక సాధ్య‌ప‌డ‌దు అని చెప్పాను. మీ మ‌ధ్య త‌గువులు పెట్టిన ఆయ‌న(రామోజీరావు) పోతున్నాడు. ఆయ‌నే క‌దా.. కుట్ర అంతా చేసింది. మీ ఇద్ద‌రిని విడ‌గొట్టింది. క‌నుక ఆయ‌న్ని తీసేస్తున్నాడు. మీ ఇద్ద‌రు ఎందుకు క‌ల‌వ‌రు అన్నాడు. అయిన‌ప్ప‌టికీ నేను ఒప్పుకోలేదు. నేను వెళ్లిపోతుంటే ఎదురుగా రామారావు వ‌స్తున్నాడు. 
 
ఆ త‌ర్వాత ఆయ‌న‌, ఈయ‌న ఏం మాట్లాడుకున్నారో తెలియ‌దు. రామోజీ... రామారావుపై ఎందుకు క‌క్ష క‌ట్టాడో అప్పుడు అర్ధ‌మైంది అని నాదెండ్ల భాస్క‌ర్ రావు చెప్పారు. ఈ కుట్ర గురించి తనకు ఏమీ తెలియదని… శంక‌రాచార్యులు తనతో చెప్పిన విషయాన్నే తాను చెప్పానని.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఏకమై… ఆయన మరణానికి కారణమయ్యారని ఆయ‌న అన్నారు. 
 
ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ అయ్యాయి. ఎప్పుడో జ‌రిగింది ఇప్పుడు బ‌య‌ట పెట్ట‌డం ఏంటి..? దీని వెన‌కున్న అస‌లు కార‌ణం ఏంటి..? అంటూ ప‌లు ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మౌతున్నాయి. ఈ వ్యాఖ్య‌లపై తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, రామోజీరావు ఎలా స్పందిస్తారో మ‌రి..?
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు