పెళ్ళయితే మహిళకి వచ్చే ఆనందం కన్నా... తల్లి అయితే వచ్చే ఆనందమే ఎక్కువ. ఏ తల్లైనా బిడ్డకి జన్మనివ్వడమనేది ఒక గొప్ప అనుభూతి. ఇందులో దురదృష్టకర విషయం ఏంటంటే... తొమ్మిది నెలలు కష్టపడి మోసి.. తీరా కనేటప్పుడు పుట్టే బిడ్డను తనివితీరా చూసుకోలేక ఎందరో తల్లులు మృత్యువు ఒడికి చేరుతున్నారు. ఇందుకు ముఖ్య కారణం... శిశువుకు జన్మనిచ్చే సమయంలో తీవ్ర రక్తస్రావానికి గురికావడంతో భారతదేశంలో గంటకు సుమారు ఐదుగురు మహిళలు చనిపోతున్నారు.
ఈ లెక్కన చూసుకుంటే యేటా దాదాపు 45,000 మంది తల్లులు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. అంతేకాదు.... ప్రపంచ వ్యాప్తంగా భారత్‌లోనే ఇలాంటి మరణాలు 17 శాతంగా ఉన్నదని డబ్ల్యూహెచ్‌ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రసవించే సమయంలో తీవ్ర రక్తస్రావంతో పాటు రక్తహీనత కారణంగా మహిళల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి.
ఇతరదేశాల్లో ఈ సమస్య ఉన్న ఈ తరహా మరణాలు ఒక్క భారతదేశంలోనే అధికంగా సంభవించడం విచారించదగ్గ విషయం. ప్రపంచ ఆరోగ్య గణాంకాలను పరిశీలిస్తే.. భారత్‌లో ప్రతి లక్ష శిశు జననాల్లో 174 మంది తల్లులు మరణిస్తున్నారని తేలింది. ఆందోళన కలిగిస్తున్న తల్లుల మరణాలను నియంత్రించేందుకు తగు చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
గర్భిణులు ఆహారంపై తగిన శ్రద్ధ చూపించకపోవడం వల్ల పోషకాహార లోపాలు, తద్వారా ఎదురయ్యే దుష్పరిణామాలతో బాధపడుతున్నారు. వీరి ఆరోగ్య పరిరక్షణకు, పోషణ స్థాయిలను పెంచడంతో పాటు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో ఈ మరణాలను నియంత్రివచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడుతోంది.