మహా మేత వర్థంతి సభలకు కోవిడ్ నిబంధనలు వర్తించవా?

మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:36 IST)
ఏపీలో ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్షాల అణివేత‌కు చేస్తున్న దురాగ‌తాల‌ను టీడీపీ అధ్య‌క్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. కాల్వ శ్రీనివాసులు, బీటెక్ రవి, లింగారెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్, ఇతర పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదును తాను ఖండిస్తున్నాని తెలిపారు. 
 
ప్రతిపక్ష నేతలను చూస్తే జగన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు? దేశంలో పిరికి ముఖ్యమంత్రి వున్నారంటే అది ఒక్క జగనే. టీడీపీ నేతలు ఇళ్ల నుండి కాలు బయటపెట్టగానే, వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అనంతపురంలో కాల్వ శ్రీనివాసులు, కడప జిల్లాలో బీటెక్ రవి, లింగారెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదును ఖండిస్తున్నా అని అచ్చెన్నాయుడు చెప్పారు. 
 
పేదలపై పెను భారంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన వారిపై కోవిడ్ ఉల్లంఘన పేరుతో అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం. మహామేత వర్థంతి సభలకు, వైసీపీ నేతల పాద యాత్రలకు కోవిడ్ నిబంధనలు వర్తించవా? మందల్లాగా బజార్లలో తిరిగిన వైసీపీ నేతలు, కార్యకర్తలపై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులు పోలీసులు ఎన్ని నమోదు చేశారు? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలపై నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు. శాంతియుతంగా నిరసన తెలిపితే అక్రమ కేసులా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాచరికంలో ఉన్నామా? ఎమర్జెన్సీని మించిన నియంతృత్వం, హిట్లర్, గడాఫీలను మించిన అరాచకం రాష్ట్రంలో నడుస్తోంద‌ని ఆరోపించారు.
 
దమ్మిడికి పనికిరాని పదవులకు మీరు వేలాది మందిని తీసుకొచ్చి ప్రమాణస్వీకారాలు, రికార్డింగ్ డాన్సులు వేయొచ్చా? ప్రజలపై పడుతున్న భారాలని తగ్గించాలని అడిగిని మా నేతలపై అక్రమ కేసులా? కాల్వ శ్రీనివాసులుపై సుమోటోగా కేసు నమోదు చేసిన బొమ్మనహల్ ఎస్.ఐ రమణారెడ్డికి వైసీపీ నేతల ఉల్లంఘనలు కనబడలేదా? లేకుంటే తాడేపల్లి రాజప్రసాదం ఆదేశాలు రాలేదా? రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నేతల చిట్టా మా దగ్గర వుంది..వారిపై సుమోటోగా కేసు నమోదు చేసే ధైర్యం డీజీపీకి వుందా అని ప్ర‌శ్నించారు.
 
కరోనా ప్రారంభం తర్వాత ముఖ్యమంత్రి ఎన్నో బహిరంగ సభలను నిర్వహించారు. ఆయనపై ఎన్ని ఉల్లంఘన కేసులు నమోదు చేశారు? ప్రతిపక్షాలు బయటకు రాగానే ఉల్లంఘనలు కనబడతాయా పోలీసులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనబెట్టి  రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి గొంతునొక్కుతున్నారు? చట్టానికి లోబడి పోలీసులు పనిచేస్తే ప్రజల చేత మంచి అనిపించుకుంటారు, లేకుంటే చరిత్ర హీనులవుతారు. కాఖీ చొక్కాల వేసుకున్నామన్న సంగతి పోలీసులు మర్చిపోవద్దని అచ్చెన్నాయుడు హెచ్చ‌రించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు