హైదరాబాద్ కాదు.. "జనాభా"బాద్..: టాప్ 10లో భాగ్యనగరం
మంగళవారం, 21 ఫిబ్రవరి 2012 (16:58 IST)
FILE
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రోజురోజుకు జనసంద్రంగా మారిపోతోంది. దేశంలో అత్యధిక జనాభా ఉన్న తొలి పది నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఆ జాబితాలో మన భాగ్యనగరం ఆరో స్థానాన్ని పొందింది. కాగా, 1.84 కోట్ల జనాభాతో ముంబయి నగరం దేశంలో కెల్లా అత్యధిక జనాభా గల మొదటి నగరంగా నిలిచింది.
1.63 కోట్ల జనాభాతో దేశ రాజధాని రెండో స్థానంలో ఉండగా, 1.41 కోట్లతో కోల్కతా మూడో స్థానంలో, 86.9 లక్షలతో చైన్నై నాలుగో స్థానంలో ఉన్నాయి. 84.9 లక్షలతో జనాభాతో బెంగళూరు మన కన్నా ముందు(ఐదో స్థానంలో) ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(టిసిపి) ఈ గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం హైదరాబాద్ జనాభా ప్రస్తుతం 77,49,334.
మిలియన్ ప్లస్ సిటీలుగా విజయవాడ, విశాఖపట్నం.. ఈ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో మిలియన్ ప్లస్ నగరాల సంఖ్య 53కు చేరింది. ఆ జాబితాలో మన రాష్ట్ర నగరాలైన విశాఖపట్టణం, విజయవాడ నగరాలకు చోటు దక్కింది. ప్రస్తుతం విశాఖ జనాభా 17, 30,320 కాగా, విజయవాడ జనాభా 14,91,202తో పదిహేను లక్షలకు చేరువలో ఉంది. 7,59,594 జనాభాతో వరంగల్ త్వరలో మిలియన్ ప్లస్ కోవలోకి చేరుకోనుంది.
గుంటూరు 6,73,952, నెల్లూరు 5,64,148, రాజమండ్రి 4,78,199, కర్నూలు 4,78,124, తిరుపతి 4,59,985, కాకినాడ 4,42,936 జనాభాతో ఉన్నాయి. లక్ష జనాభా దాటిన పట్టణాలు మన దేశంలో 468 ఉండగా, మన రాష్ట్రంలో 44 ఉన్నాయి. మొత్తంగా పట్టణీకరణలో 33.49% జనాభాతో మనం దేశంలో 17వ స్థానంలో ఉన్నాము.
ప్రస్తుతం భారతదేశంలో పట్టణ ప్రాంత జనాభా 37.7 కోట్లు (31.36%)కాగా 2001లో అది 28.6 కోట్లు (27.82%) గా నమోదైంది. మన రాష్ట్ర పట్టణ ప్రాంత జనాభా పదేళ్ల క్రితం 2.08 కోట్లు (27.3%) కాగా ప్రస్తుతం అది 2.85 కోట్లు (33.49%)కు చేరింది. 2001 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 210 పట్టణాలుంటే... వాటి సంఖ్య ఇప్పుడు 353కు పెరిగిందని నివేదిక చెప్పింది