వైసీపీ రెండున్నరేళ్ల పాలన ఒక పీడ కల: తులసి రెడ్డి

మంగళవారం, 30 నవంబరు 2021 (16:19 IST)
వైసీపీ  అధికారంలోకి వచ్చి, జగన్ సీఎం అయి నేటికి రెండున్నర సంవత్సరాలు, అంటే సగం పాలనా కాలం పూర్తయిందని, ఈ సగం పాలనా కాలం రాష్ట్రానికి ఒక పీడకల అని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షులు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.


రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి నిప్పుల పొయ్యిలో పడ్డట్లుగా ఉందని, అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం అన్నట్లు సాగిందని విమర్శించారు. 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాలలో 16 మంది ముఖ్యమంత్రులు లక్ష కోట్ల అప్పు చేయగా 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రూ. 1. లక్షల కోట్లు అదనపు అప్పు చేయగా ఈ రెండున్నర ఏళ్లలో జగన్ సీఎం గా రూ. 3. 37 లక్షల కోట్లు అప్పులు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు.
 
 
 వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో వ్యవసాయ, సాగునీటి రంగాలు నిధులు లేక నీరసించి పోయాయని, ప్రగతి సూచికలైన రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా మారిందని, జేసిబీ, ఏసీబీ, పీసీబీ  సంస్కృతితో పరిశ్రమలు రాలేదన్నారు. ఆసరా, చేయూత, అమ్మ ఒడి తదితర సంక్షేమ పధకాల ద్వారా లబ్దిదారులకు అందే డబ్బు నాన్న బుడ్డికి (మందు బాటిల్ ) చాలడంలేదని అన్నారు. రైతులు, కూలీలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత ఇలా అన్ని వర్గాల వారు అసంతృప్తితో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. 
 
రాష్ట్రం రాక్షస రాజ్యం, రౌడీల రాజ్యం , రావణ కాష్టం అయిందని తులసి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వస్తువుల ధరలు పెంచి, పన్నులు వేసి వడ్డింపుల, వాయింపుల ప్రభుత్వంగా తయారైనదని, నాడు ముద్దులు - నేడు పిడి గుద్దులు, నాడు రావాలి జగన్, కావాలి జగన్ అన్న వారే నేడు దిగి పోవాలి జగన్ - వద్దు జగన్ అని అంటున్నారన్నారు. కనీసం రాబోయే రెండున్నర సంవత్సరాల్లోనైనా మంచి పాలన అందించేటట్లు ముఖ్యమంత్రికి, వైసీపీ నాయకులకు సద్బుద్ధిని ప్రసాదించాలని తులసి రెడ్డి భగవంతుని ప్రార్ధించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు