కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియ అరెస్టు.. పరారీలో భర్త!?

బుధవారం, 6 జనవరి 2021 (12:32 IST)
హైదరాబాద్ నగరంలోని హఫీజ్ పేటలో వెలుగులోకి వచ్చిన ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. కూకట్ పల్లిలోని లోథా అపార్ట్‌మెంట్స్ సమీపంలో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె వాహనంలోనే పోలీసు స్టేషన్‌కు తరలించారు. నార్త్ జోన్ మహిళా ఇన్ స్పెక్టర్ ఆధ్వర్యంలో అఖిల ప్రియను అరెస్ట్ చేశారు. 
 
ఇక ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, ఆయన్ను సాధ్యమైనంత త్వరగా అరెస్టు చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. బోయిన్ పల్లి మహిళా పోలీసు స్టేషన్‌లో ఆమెను విచారించి, ఆపై కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. 
 
అయితే, భూమా అఖిలప్రియా రెడ్డి అరెస్టుకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే, గురువారం రాత్రి బోయినపల్లిలో ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌కు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి, కిడ్నాప్‌ కథను కొన్ని గంటల్లోనే సుఖాంతం చేశారు. 
 
ఈ ముగ్గురిని కిడ్నాపర్లు నార్సింగిలో వదిలి పారిపోయారు. కిడ్నాపైనవారిని ప్రవీణ్, నవీన్, సునీల్ గుర్తించారు. వీరంతా సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. పైగా, వీరు సీఎం కేసీఆర్‌ సోదరి తరపు సమీప బంధువులని తేలింది. వీరు ముగ్గురూ సీఎం కేసీఆర్‌ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులు. 
 
గత రాత్రి 11 గంటల సమయంలో సినీఫక్కీలో హకీ క్రీడాకారుడు ప్రవీణ్‌ రావు కిడ్నాప్‌‌కు గురయ్యాడు. ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డ కిడ్నాపర్లు.. భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రవీణ్‌రావు సహా ఇద్దరు సోదరులను దుండగులు కిడ్నాప్‌ చేశారు. 
 
కుటుంబసభ్యుల ఫిర్యాదుతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్, నవీన్, సునీల్‌లను వికారాబాద్‌లో గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేయగా.. మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ సోదరుడు చంద్రహాస్‌ పోలీసుల అదుపులో ఉన్నారు. హాఫీజ్‌పేటలోని వంద కోట్ల విలువైన భూమి కోసం కొంతకాలంగా గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు, తమపై వస్తున్న వార్తలపై భూమా అఖిల ప్రియా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తన భర్త కిడ్నాప్ చేయించే వ్యక్తి కాదని.. భార్గవ్‌కు కిడ్నాప్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. 
 
పైగా, తమ కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయలేదని.. తనకు కొంత సమయం ఇస్తే అన్ని విషయాలు మీడియాకు తెలుపుతానన్నారు. ఒక వైపు వాదనలు విని... తమపై తప్పుడు వార్తలు ప్రసారం చేయవద్దని మీడియాను కోరారు. మీడియా అంటే తమ కుటుంబానికి చాలా గౌరవం ఉందని.. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు