తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు.. 24 గంటల్లో భారీ వర్షాలు

శనివారం, 17 జూన్ 2017 (11:25 IST)
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాల విస్తరణ నేపథ్యంలో.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బంగ్లాదేశ్‌ వైపు వెళ్లి బలహీనపడినా రుతుపవనాలకు అనుకూలంగా మారింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తర కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. కాగా శుక్రవారం ఉదయం వరకు పాలకోడూరు, అమలాపురంలలో 11, గుడివాడలో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
 
రానున్న 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర భారతం వైపు రుతుపవనాలు విస్తరిస్తున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపారు. అరేబియా సముద్రం నుంచి మాన్‌సూన్‌ కరెంట్‌ బలంగా విస్తరిస్తున్నందున వాతావరణం అనుకూలంగా మారిందన్నారు.

వెబ్దునియా పై చదవండి