ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను... తెదేపాలో 'దూకుడు'... ఏంటది?

సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (11:26 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఒకవైపు జనసేన మరోవైపు వైకాపా. తెలుగుదేశం పార్టీకి రాజకీయ నాయకులతో పాటు సినీ గ్లామర్ కూడా కంపల్సరీ అనేది గత ఎన్నికల నుంచి తెలుస్తున్నదే. గత 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పూర్తిస్థాయి మద్దతు ఇచ్చి తెదేపా గెలుపుకి బాటలు వేశారు.

ఈసారి జనసేన పార్టీ సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించడంతో తెలుగుదేశం పార్టీకి సినీ గ్లామర్ దాదాపు లేకుండా పోయినట్లయింది. ఈ నేపధ్యంలో మళ్లీ బాగా పేరున్న హీరోను రంగంలోకి దింపాలని తెదేపా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఇందులో భాగంగానే కొద్ది రోజుల కిందట వైసీపీని వీడిన సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావును తెదేపాలో చేర్చుకుని తద్వారా ప్రిన్స్ మహేష్ బాబుతో తెదేపాకు ప్రచారం చేయించాలని తెదేపా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుర్రిపాలెం వెళ్లి ఆదిశేషగిరి రావుతో చర్చలు జరపడం, ఆయన సీఎం చంద్రబాబుకి పూర్తి మద్దతు ప్రకటించడం జరిగిపోయాయి. ఫిబ్రవరి 7న ఆయన తెదేపా తీర్థం పుచ్చుకుంటారని అనుకుంటున్నారు.
 
ఇదే నిజమైతే ఆయన ద్వారా మహేష్ బాబును వచ్చే ఎన్నికల్లో పర్యటనకు ఆహ్వానించాలని కొందరు తెదేపా నాయకులు అనుకుంటున్నారు. మరి ప్రిన్స్ మహేష్ బాబు దీనికి అంగీకరిస్తారా... ఎప్పటిలాగే తను రాజకీయాలకు చాలా దూరం దూరం... అని పక్కకు జరుగుతారా... చూద్దాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు