ఏపీలో మరో 7 ఐటీ సంస్థలు... ప్రారంభించనున్న మంత్రి నారా లోకేష్
మంగళవారం, 2 మే 2017 (19:01 IST)
అమరావతి : రాష్ట్రానికి ఐటీ కంపెనీలను రప్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సొసైటీ విశేష కృషి చేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ చొరవతో గత ఏడాది విజయవాడలో ఏడు ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలు, ప్రారంభించగా.. విశాఖపట్నంలో తొమ్మిది సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ సంస్థల ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. తాజాగా రాజధాని ప్రాంతంలో మరో ఏడు ఐటీ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. మేధా టవర్స్‌లో కార్యకలాపాలు నిర్వహించనున్న ఈ ఐటీ సంస్థలను ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారు.
మేధా టవర్స్‌లో ప్రారంభం కానున్న ఐటీ సంస్థల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్రూపో ఆటోలిన్ సంస్థ ఒకటి. ఈ సంస్థ ఆటోమోటివ్ ఇంటీరియర్ డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్‌లో పేరెన్నికగన్నది. మొత్తం 17 దేశాల్లో శాఖలు కలిగిన ఈ సంస్థ.. 15 బిలియన్ల ఆదాయం కళ్లజూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోడ్ల మీద తిరుగుతున్న 80 శాతం లగ్జరీ కార్లకు ఈ సంస్థే ఇంటీరియర్ డిజైన్ చేసింది. ప్రస్తుతం ఇంటీరియర్ డిజైన్ కోసం ఇక్కడ శాఖను ప్రారంభిస్తున్న ఈ సంస్థ.. పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. ఉత్పత్తి కార్యకలాపాలు కూడా ఇక్కడే చేపట్టే అవకాశం ఉంది.
అలాగే తక్కువ బడ్జెట్ కార్లకు కూడా ఈ సంస్థ ఇంటీరియర్ డిజైన్లు అందిస్తుంటుంది. ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలో దాదాపు 600 మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయి. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో పేరున్న రోటోమేకర్ సంస్థ కూడా అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. బాహుబలి సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన సంస్థల్లో ఇది కూడా ఒకటి. సోని, ఫాక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతో కలసి పనిచేసే ఈ సంస్థ.. విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ తదితరం అంశాలపై కూడా పనిచేస్తోంది. అమరావతి కేంద్రంగా విజువల్ ఎఫెక్ట్స్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తోంది.
ఈ సంస్థ ద్వారా 500 మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయని భావిస్తున్నారు. అమెరికాలోని హూస్టన్ కేంద్రంగా పనిచేసే మెస్లోవా అనే కంపెనీ.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చమురు సంస్థలతో కలసి పనిచేస్తోంది. అప్లికేషన్, సాఫ్ట్ వేర్, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ తో పాటు విద్యారంగంలోనూ ఈ సంస్థ పెట్టుబడులు పెట్టబోతోంది. రెండొందల మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించబోతోంది. మొబైల్ అప్లికేషన్, వెబ్ టెస్టింగ్, ఈ కామర్స్ రంగాలతో పాటు బిగ్ డాటా, శాప్, ఒరాకిల్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇచ్చే చందు సాఫ్ట్, ఈపి సాఫ్ట్, యంయాహ్ ఐటి సొల్యూషన్స్ సంస్థలు.. మేధాటవర్స్ లో 350 మందికి పైగా ఉద్యోగాలు కల్పించడానికి సిద్ధమయ్యాయి. మొత్తమీద ఈ ఏడు సంస్థలు అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభిస్తే.. 1650 మందికి ఉద్యోగాలు దక్కుతాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో క్రితం ఏడాది ఏర్పాటైన ఏపీ ప్రవాస తెలుగు సొసైటీలో 83 దేశాలకు చెందిన 32 వేల మంది తెలుగువాళ్లు సభ్యులుగా ఉన్నారు. సొసైటీ సీఈఓ డాక్టర్ రవి వేమూరి అధ్యక్షతన లాభాపేక్ష లేని సొసైటీగా దీనిని ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి కేంద్రంగా ఉన్న ఈ సొసైటీకి 192 మంది అంతర్జాతీయ కో ఆర్డినేటర్లు, ఆరుగురు ప్రాంతీయ అడ్మినిస్ట్రేటర్లు కలిసి.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రవాస తెలుగువారికి మధ్య వారధిలా పనిచేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడం, వారికి అవసరమైన న్యాయ, బ్యాంకింగ్ సలహాలు అందివ్వడం సొసైటీ చేసే ముఖ్య కార్యక్రమం.
అమెరికా నుంచి వచ్చే ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను కూడా ఈ సొసైటీ సమకూరుస్తుంది. ఇక్కడ కంపెనీలు పెట్టే సంస్థల అవసరం కోసం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు 14 కేంద్రాల ద్వారా శిక్షణ ఇప్పించే కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. అమరావతిని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు ఐటీ సంస్థలను ఏర్పాటు చేయడంలో ఏపీ ప్రవాస తెలుగు సొసైటీ కీలకపాత్ర పోషిస్తోంది.