చంద్రబాబుకు భద్రత తగ్గింపు!

బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (09:01 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భద్రత తగ్గించారు. నక్సలైట్ల నుంచి ముప్పు ఉన్న చంద్రబాబుకు కేంద్రం జడ్‌ ప్లస్‌ కేటగిరిలో రక్షణ కల్పించింది.

దీని ప్రకారం చంద్రబాబు చుట్టూ 160 మంది సిబ్బంది భద్రతగా ఉండేవారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ సంఖ్యలో భారీగా కోత విధించింది. దీనిపై టీడీపీ కోర్టును ఆశ్రయించింది. 97 మందితో రక్షణ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం రాతపూర్వకంగా కోర్టుకు నివేదించింది.

అయితే తాజాగా నిఘా విభాగం ఐజీ రాసిన లేఖ ప్రకారం ఆ సంఖ్యను 58కి తగ్గించనున్నారు. ఐజీ లేఖ ప్రకారం... తాజాగా జరిగిన సెక్యూరిటీ రివ్యూ సమావేశంలో రాష్ట్రంలోని ప్రముఖులకు కల్పిస్తున్న భద్రతను సమీక్షించారు.

ఎల్లోబుక్‌ను అనుసరించి చంద్రబాబు రక్షణ సిబ్బంది సంఖ్యను కుదించాలని నిర్ణయించారు. అయితే దీనిపై టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. బాబుకు భద్రత తగ్గించడం వెనుక వైసీపీ కుట్ర కోణం ఉందని తెలుగుదేశం ఆరోపిస్తోంది.

రాజకీయ దురుద్దేశాలతోనే ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఒక ప్రకటన విడుదల చేశారు. భద్రతా సమస్యలు ఎదుర్కొంటున్న వారి విషయంలో రాజకీయ కోణంలో ఆలోచించడం... నిర్ణయాలు తీసుకోవడం దారుణమని విమర్శించారు.

‘పూర్వపు భద్రతను పునరుద్ధరించాలని గట్టిగా కోరుతున్నాం. ఏదైనా అనుకోని పరిణామం చోటు చేసుకొంటే దానికి వెసీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం’ అని పేర్కొన్నారు. 
 
భద్రతలో ఎలాంటి మార్పులు జరగలేదు: పోలీసులు
చంద్రబాబు నాయుడు భద్రతలో ఎలాంటి మార్పులు జరగలేదు. దేశంలోనే అత్యంత హై - సెక్యూరిటీని మాజీ ముఖ్యమంత్రికి కల్పిస్తున్నాం. ప్రస్తుతం Z+ సెక్యూరిటీలో చంద్రబాబుకి భద్రత కల్పిస్తున్నాం.

సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు, చేర్పులు చేస్తాం. ప్రస్తుతం మొత్తం 183 మందితో భద్రత కల్పిస్తున్నాం. విజయవాడలో 135 మంది, హైదరాబాద్ లో 48 మందితో భద్రత కల్పిస్తున్నాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు