సూపర్ సిక్స్‌లో ఉచిత గ్యాసా? ఉచిత బస్సా? ఏది అమలు చేద్దాం!

ఠాగూర్

శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (14:26 IST)
గత సార్వత్రిక ఎన్నికల కోసం టీడీపీ సూపర్ సిక్స్ హామీలను ఇచ్చింది. ఇపుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాల అమలు కోసం చర్యలు చేపట్టింది. అయితే, సూపర్ సిక్స్‌లో భాగంగా, మహిళలకు ఇచ్చిన హామీల్లో దేన్ని ముందు అమలు చేయాల న్నఅంశంపైనా చర్చసాగుతుంది. ఉచిత వంటగ్యాస్ పథకం, ఉచిత బస్సు సౌకర్యం రెండింట్లో ఏది ముందు అమలు చేయాలన్న అంశం చర్చకు వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉచిత వంటగ్యాస్ పథకానికే సీఎం చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నారు. 
 
ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇచ్చే పథకాన్ని వచ్చే దీపావళి నుంచి అమలు చేయాలని, నాలుగు నెలలకో సిలిండరు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. దాని తర్వాత తల్లికి వందనం పథకాన్ని, ఆ తర్వాత ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తర్వాత అమ్మ ఒడి పథకాన్ని అమలు చేయడమే కాకుండా, ఒక సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టిన జగన్.. ఇప్పుడు ఎన్డీయే అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే 'తల్లికి వందనం' అమలు చేయడం లేదని విమర్శిస్తున్నారని క్యాబినెట్ మండిపడింది.
 
వరద బాధితుల్ని ఆదుకోవడంలో చంద్రబాబు చేసిన కృషికి.. మంత్రులంతా లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు. చంద్రబాబు రేయింబవళ్లు కష్టపడి వరద బాధితుల్ని ఆదుకున్నారంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనతో కరచాలనం చేసి అభినందించారు. మంత్రులు, అధికారుల సమష్టి కృషి వల్లే బాధితులకు అండగా నిలవగలిగామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయనకు మంత్రివర్గం అభినందనలు తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు