వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమేనని అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఒక్కటై ఈ కేసులు పెట్టారని ఆరోపించారు. తన తండ్రి బతికున్నంత కాలం తన మీద ఏ కేసులు లేవని.. అలాగే తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కేసులు లేవన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు బయటికి వచ్చానో.. అప్పుడే తనపై కేసులు పెట్టారన్నారు.
అప్పట్లో అధికారంలో ఉన్న సోనియాగాంధీతో కలిసి చంద్రబాబునాయుడే తన పార్టీ నాయకుల ద్వారా తనపై ఈ కేసులు పెట్టించారన్నారు. నిజానికి ఒక వ్యక్తి తప్పు చేసినట్లు ఇంకా రుజువు కాకపోతే.. మూడు నెలల కంటే ఎక్కువ కాలం జైల్లో పెట్టే అధికారం లేదని, అయినా తనను 16 నెలల పాటు జైల్లో పెట్టారని తెలిపారు. జగన్ కనపడకపోతే పార్టీ ఉండదని భావించి చంద్రబాబు, తనను రాజకీయంగా అణగదొక్కేందుకే కాంగ్రెస్ కలిసి ఈ కుట్ర చేసిందన్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఏపీలో ప్రజాస్వామ్య రక్షణ కోసం వివిధ పార్టీ నేతలను జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఇందులో భాగంగానే సీపీఐ అగ్రనేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డి. రాజా తదితరులను కలిశారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైన 21 మందిని టీడీపీలో చేర్చుకోవడమే కాక, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన వైనాన్ని వారికి జగన్ ఈ సందర్భంగా వివరించారు. అనంతరం సురవరం, రాజాలతో కలిసి మీడియాతో మాట్లాడారు.