వాగ్దానాలు గాల్లో దీపాలుగా ఆరిపోతున్న తరుణంలో వాగ్దానాలే పునాదులుగా తెలంగాణ రాజకీయ యవనికలో దూసుకొచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పటికే చేసిన వాగ్దానాలు పూర్తిగా నెరవేరకుండా పోతున్న సమయంలో హైదరాబాద్‌లో రోజూ మంచినీళ్లిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ వినూత్న ప్రకటన చేసిపడేశారు. ఆయన ధీమాకు తెలంగాణ శాసనసభ హామీగా నిలిచింది.
మార్చి నెలనుంచి గ్రేటర్ హైదరాబాద్ అంతటా ప్రతి రోజూ మంచి నీళ్లివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేసీఆర్ తనయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 200 మురికివాడల్లోని సుమారు 50 వేల కుటుంబాలకు సరఫరా చేస్తున్నాం. మరో రెండు నెలల తర్వాత మార్చి నుంచి గ్రేటర్‌వ్యాప్తంగా విస్తరిస్తాం’’ అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మరో 50 ఏళ్ల వరకు హైదరాబాద్‌కు నీటి అవసరాలు సరిపోయేలా పథకాలు రూపొందిస్తున్నామని తెలిపారు.
అంటే జీహెచ్ఎంసీ పరిధిలోని 90 లక్షలమంది ప్రజలకు ప్రతి రోజూ మంచి నీళ్ళ సరఫరాకు ప్రభుత్వం నడుం కట్టినట్లే. ఇదే నిజమైతే భారతదేశంలోనే నీటి సరఫరాకు సంబంధించి సరికొత్త ఆవిష్కరణకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లవుతోంది. రోజు విడిచి రోజు నీటి సరఫరాకే గతిలేని పరిస్ధితిలో ఇంత మార్పును నిజంగానే తేగలిగితే తెరాస క్రెడిట్ స్కోరు అమాంతంగా పెరిగినట్లే. అది సాధ్యమా అనేది ముందున్న సమస్య.