టిటిడి మాజీ ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఛైర్మన్ పదవీకాలం పూర్తయి పార్టీలో కొత్త పదవి కోసం ప్రయత్నిస్తున్న చదలవాడకు పెద్ద సమస్యే వచ్చి పడింది. ఇంతకీ టిటిడి మాజీ ఛైర్మన్‌కు వచ్చిన సమస్య ఏంటి.. తిరుపతి నగర నడిబొడ్డులో గ్రూప్ థియేటర్స్ పేరుతో కొన్ని థియేటర్లను నడుపుతున్నారు మాజీ టిటిడి ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి.
ఎన్నో సంవత్సరాల క్రితం థియేటర్లను కొనుగోలు చేశారు. తిరుపతికి చెందిన మాజీ ప్రముఖుడు గురవారెడ్డికి చెందిన సన్నిహితుల నుంచే థియేటర్లను కొనుగోలు చేశారు చదలవాడ. ఆ థియేటర్లతో పాటు పక్కనే మరో స్థలాన్ని కూడా కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఆ స్థలంలో నూతనంగా పెట్రోల్ బంకును ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆ స్థలానికి పక్కనే పిజిఆర్ థియేటర్స్ ఆనుకుని ఉంది. పి.జి.ఆర్ థియేటర్స్‌కు చెందిన వారే గతంలో చదలవాడ క్రిష్ణమూర్తికి స్థలాన్ని విక్రయించారు. అయితే చదలవాడ పిజిఆర్ థియేటర్స్‌కు చెందిన స్థలంలో కొంత భాగాన్ని ఆక్రమించుకుని గోడను నిర్మించాడు. గత కొన్ని రోజులుగా పిజిఆర్ థియేటర్ మూతపడి ఉండటంతో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
అయితే పిజిఆర్ థియేటర్‌ను తిరిగి తెరవడంతో అసలు విషయం బయటపడింది. థియేటర్‌కు పార్కింగ్ లేకపోవడంతో ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి పిజిఆర్ థియేటర్ ఓనర్ అభిషేక్ రెడ్డి జెసిబీలతో రంగంలోకి దిగాడు. విషయం తెలుసుకున్న చదలవాడ వర్గీయులు జెసిబీని అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి రెండు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయంపై కోర్టుకెళ్ళేందుకు సిద్ధమయ్యారు చదలవాడ క్రిష్ణమూర్తి.