బాలలు, మహిళల సమగ్ర అభివృద్ధికి విజన్ 2026

మంగళవారం, 24 జనవరి 2017 (21:42 IST)
రాష్ట్రంలో బాలలు, మహిళలు సంపూర్ణ వికాసానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా వారికి వచ్చే రుగ్మతలను దూరం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. మహిళలు గర్భం దాల్చిన దగ్గర్నుంచి మూడేళ్లపాటు అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రణాళికను రూపొందించింది. పుట్టిన చిన్నారులు, గర్బిణులు, బాలింతలకు తగిన పౌష్టిక ఆహారాన్ని అందించి ఆరోగ్యవంతులుగా చేయాలన్న లక్ష్యంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ విజన్ 2026 ఆవిష్కరించింది. రాష్ట్రంలో బాలలు, మహిళలు శారీరకంగా వృద్ధి చెందడం... ఐదేళ్లలోపు ప్రస్తుతమున్న 31.4 శాతం నుంచి 16 శాతానికి తీసుకురావాలని నిర్ణయించారు. గర్బిణుల్లో రక్త హీనతను 60.2 శాతం నుంచి 40 శాతానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 
 
2026 లక్ష్యంగా ప్రణాళిక
అప్పుడే పుట్టిన పిల్లల్లో తగిన ఎత్తు ఉండకపోవడమన్న పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆ ప్రాతిపదికలో 15 పాయింట్లను తగ్గించడం ద్వారా వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. మహిళల్లో రక్తహీనతను 20 పాయింట్ల మేర తగ్గించడం ద్వారా వారికి పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతులుగా జన్మించేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పుట్టిన బిడ్డలకు తల్లిపాలను ఇచ్చే విషయంలో 20 పాయింట్లు ముందుకు జరగాలన్నది లక్ష్యం నిర్దేశించుకున్నారు. సాలిడ్ ఫుడ్‌తో పాటు, సెమీ సాలిడ్ ఫుడ్‌తో పాటు తల్లిపాలు అందజేయడంలో 20 పాయింట్లు మెరుగవ్వాలన్నది ప్రణాళిక ఉద్దేశం. 
 
ఇక ఆరు నెలల నుంచి 23 నెలల మధ్య వయసు ఉన్న పసిపిల్లల కోసం తగిన ఆహారాన్ని అందించే సూచీలో 25 పాయింట్లను చేరుకోవడం ద్వారా వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయాలని ఐసీడీఎస్ ప్రణాళిక రూపొందించింది. తక్కువ బరువు సూచీకి సంబంధించి 10 పాయింట్లను తగ్గించాలన్నది ప్రణాళిక. పుట్టిన బిడ్డలు బరువుకు సమస్సను వీలైనంతగా తగ్గించడం ద్వారా వారిని పూర్తి స్థాయి ఆరోగ్యవంతులుగా మార్చాలన్న ఉద్దేశంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉంది. 2030 నాటికి రాష్ట్రంలో పౌష్టికాహార సమస్య తలెత్తరాదన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది.
 
మిషన్‌ను పకడ్బందీగా అమలు చేయడమే లక్ష్యం
రాష్ట్రంలో పౌష్టికాహార లోపంతో ఏ పుట్టబోయే చిన్నారులు కానీ, గర్భిణీలు కానీ, బాలింతలు గానీ ఒక్కరు కూడా చనిపోరాదన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర పౌష్టికాహార మిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మిషన్ ద్వారా ఎవరికైతే పౌష్టికాహారం అందించాలో వారికి అందజేయడం... తద్వారా పౌష్టికాహార సూచికల్లో మెరుగైన పనితీరును ప్రదర్శించాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితి
దేశంలో చిన్నారుల ఎత్తు తక్కువ సమస్య 38.7 శాతంగా ఉంది. అది రాష్ట్రంలో 31.4 గా ఉంది. ఈ విషయంలో దేశంలోనే కేరళ ఆదర్శంగా ఉంది. కేవలం 19.4 పాయింట్లతో ఆ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. ప్రపంచంలో జర్మనీ మంచి ట్రాక్ రికార్డు నమోదవుతోంది. ఈ విషయంలో ముందంజలో ఉంది. కేవలం 1.3 శాతం మాత్రమే ఆ దేశంలో చిన్నారులు ఎత్తు సమస్యతో పుడుతున్నారు. ఇక రాష్ట్రంలో ఐదేళ్ల లోపు చిన్నారుల్లో ఎత్తు తక్కువ సమస్యతో బాధపడుతున్న జిల్లాలో అధికంగా ఉంది. అక్కడ 44.1 శాతం మంది చిన్నారులు ఎత్తు సమస్యతో జన్మిస్తున్నారు. గుంటూరు జిల్లాలో అత్యల్పంగా 22.1 శాతం మంది మాత్రమే ఎత్తు సమస్య కలిగి ఉన్నారు. పుట్టిన పిల్లల్లో ఎత్తు క్రమపద్ధతిలో ఉండాలే చేసేందుకు 2026 లక్ష్యం కీలకమైనది. ఎత్తు సూచికలో ఇప్పుడు 31.4 శాతంగా ఉన్న సమస్యను 2026 నాటికి 15 పాయింట్లు తగ్గించి 16 శాతానికి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
  
గర్బిణీల్లో అనీమియా విషయంలో భారత దేశంలో 48.1 పాయింట్లతో ఉండగా రాష్ట్రం 60.2 పాయింట్ల వద్ద ఉంది. ఇక ఈ విషయంలో సిక్కిం ఆదర్శవంతంగా 23.3 పాయింట్లతో ముందు వరుసలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయంలో అమెరికా 11.9 శాతంతో ముందుంది.
 
పుట్టిన బిడ్డలకు అప్పుడే పాలిచ్చే అంశంలో ఇండియా 50.82 పాయింట్లతో ఉండగా... రాష్ట్రం 40.1 శాతం వద్ద ఉంది. దేశంలో 70.3 పాయింట్లతో గోవా ముందు వరసుగా ఉంది. బిడ్డ పుట్టిన ఆర్నెలలోపాటు తల్లిపాలు బిడ్డలకు అందిస్తున్న సూచికలో ఇండియా 57.41 శాతంగా ఉండగా... ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యత్తమంగా ఉంది. 71.2 శాతం మేర రాష్ట్రం ఉండగా... మణిపూర్ 73.6 శాతంతో ముందంజలో ఉంది. ఈ విషయంలో 87 పాయింట్లతో రువాండా ప్రపంచానికే ఆదర్శంగా ఉంది.
 
చిన్నారులు తల్లిపాలతోపాటు, సాలిడ్ ఫుడ్, సెమీ సాలిడ్ ఫుడ్ విషయంలో భారత్ 53.19 శాతం వద్ద ఉండగా, రాష్ట్రం 56.1 శాతం వద్ద ఉంది. ఇక దేశంలోనే తమిళనాడు 81.2 శాతం మేర ముందంజలో ఉంది. చిన్నారులకు తగిన విధంగా ఆహారం అందుతున్న సూచికలో దేశం 13.81 శాతం పాయింట్ల వద్ద ఉండగా... రాష్ట్రం 7.6 శాతం ఉండగా, ఇక దేశంలో తమిళనాడు 30.7 శాతంగా నెంబర్ వన్‌గా ఉంది.
 
గ్రామ పంచాయతి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు కమిటీలు
గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ మిషన్ మానిటరింగ్ ఇంప్లిమెంటేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. మండల స్థాయి/నగర పాలికల స్థాయి/జిల్లా స్థాయి/రాష్ట్ర స్థాయిలో సమావేశాలు నిర్వహించి... అహగాహన కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్ర స్థాయి సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. ఇలా కార్యక్రమ పనితీరు గురించి ఎప్పటికప్పుడు శోధన చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. 
 
యూనిసెఫ్ సహకారం
రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పౌష్టికాహార మిషన్ 2026 యూనిసెఫ్ నిధులు అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ నిధులు ఈ పథకం కోసం అందిస్తున్నాయి. సాంకేతికంగా, ఆర్థికంగా సహకారం అందించేందుకు ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేయాలని సర్కారు యోచిస్తోంది. 
 
పకడ్బందీగా కార్యాచరణ
పౌష్టికాహర మిషన్ తో ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికతో ముందడుగేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో కార్యక్రమ అమలు గురించి అధికారులకు స్పష్టం ఇచ్చింది. ఈ కార్యక్రమంలో విద్య, వైద్య శాఖలు, రూరల్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు భాగస్వాములుగా ఉన్నారు. నాలుగు రీజియన్లలో దీనికి సంబంధించి సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఇటీవల జిల్లా స్థాయి సమావేశాలను కూడా పూర్తి చేశారు. త్వరలోనే మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఏఏ మండలాల్లో ప్రభుత్వం ఎలాంటి కార్యచరణ అమలు చేయాలన్నదానిపై క్లారిటీతో పనిచేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఇలా చేయడం ద్వారా ఏ ప్రాంతంలో ఎలాంటి సమస్య ఉందో దానికి అనుగుణంగా ప్రణాళికలను రూపొందిస్తారు.

వెబ్దునియా పై చదవండి