ప్రధాని మోడీని కలిసిన కొత్తపల్లి గీత... షోకాజ్ నోటీసులిచ్చిన వైకాపా

గురువారం, 22 మార్చి 2018 (10:45 IST)
వైకాపాకు చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు ఆ పార్టీ అధిష్టానం షాకిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కావడాన్ని ఆ పార్టీ సీరియస్‌గా తీసుకుని, షోకాజ్ నోటీసు జారీచేసింది. లోక్‌సభలో తాము జారీ చేసిన విప్‌కు విరుద్ధంగా వ్యవహరించారని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని ఎందుకు అనర్హత వేటు వేయరాదో ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని చీఫ్‌ విప్‌ వైవీ సుబ్బారెడ్డి నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో 19న విప్‌ జారీచేశామని నోటీసుల్లో పేర్కొన్నారు. 20వ తేదీన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్న వారిని నిలబడమని స్పీకర్‌ రూలింగ్‌ ఇచ్చినప్పుడు వైసీపీ ఎంపీలంతా నిల్చున్నా గీత నిలబడలేదని తాము గుర్తించామని అన్నారు. నోటీసుకు ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. సుబ్బా రెడ్డి జారీ చేసిన షోకాజ్‌ నోటీసులకు కొత్తపల్లి గీత స్పందించారు. 
 
'అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినప్పుడే విప్‌ పనిచేస్తుందని, నిలబడకపోవడానికి విప్‌ చెల్లదు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సీరియస్‌ అంశంపై చర్చించడానికి కాకుండా నాపై వ్యక్తిగత కక్ష తీర్చుకోడానికే అవిశ్వాస తీర్మానం పెట్టారు' అని ఆమె మండిపడ్డారు. ఈ నోటీసులకు తాను వివరణ ఇస్తానని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు