ఆ ముగ్గురితో మీటింగ్ అంటేనే పారిపోతున్న జగన్ రాజకీయ వ్యూహకర్త!

మంగళవారం, 20 మార్చి 2018 (15:08 IST)
వైకాపాలో అత్యంత కీలకంగా నేతల్లో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఒకరు. ఈయన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి గుండెకాయలాంటివారు. జగన్ లెక్కల పద్దంతా ఆయన వద్దే ఉంది. ఎందుకంటే.. ఈయన ఓ ఆడిటర్. దీంతో జగన్ కంపెనీల లెక్కల పద్దులన్నీ విజయసాయి రెడ్డి పర్యవేక్షిస్తుంటారు. 
 
అయితే, 2019లో పార్టీని గెలిపించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని జగన్ కలలు కంటున్నారు. ఇందుకోసం ఆయన పలు రాష్ట్రాల్లో పలువురిని ముఖ్యమంత్రులు చేసిన రాజకీయ వ్యూహకర్తను సంప్రదించారు. ఆయన ఎవరో కాదు.. ప్రశాంత్ కిషోర్. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) ఛైర్మన్. ఇపుడు జగన్‌కు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. 
 
ఈయనకు పార్టీలోని సీనియర్ నేతల కంటే అధిక ప్రాధాన్యతను జగన్ ఇస్తూ వస్తున్నారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ వైసీపీ వ్యవహారాలకు దూరంగా, మౌనంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనికంతటికీ కారణం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అని చెబుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో పీకే ఇచ్చిన సలహాలను విజయసాయి రెడ్డి పట్టించుకోలేదనే ప్రచారం సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా వెళ్తున్న పీకే... బీజేపీకి వైసీపీని దగ్గర చేయాలని భావించారట. పీకే చెబుతున్న సలహాలను అమలు చేయాలని జగన్ చెబుతున్నప్పటికీ... విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో పని చేసే పీకే అనుచరులు వాటిని అమలు చేయలేకపోతున్నారట. విజయసాయిరెడ్డి జోక్యం, ఆధిపత్యం పెరిగిపోవడంతో... పీకే టీమ్‌లోని ఒక్కొక్కరు ఐప్యాక్ కు రాజీనామా చేస్తున్నారట. 
 
మరోవైపు పీకేతో పాటు, ఐప్యాక్‌లోని మరో కీలక నేత రిషీని కూడా విజయసాయిరెడ్డితో పాటు, జగన్ బంధువులు ఇద్దరు లెక్కచేయడం లేదట. దీంతో, వీరితో సమావేశం అంటేనే పీకే టీమ్ వణికిపోతున్నారట. ఈ ముగ్గురికీ రాజకీయాలపై పూర్తి అవగాహన లేదని... వీరి వల్ల పీకే ఇమేజ్‌కు డ్యామేజ్ జరుగుతుందని ఐప్యాక్‌కు సమాచారం ఇచ్చారట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు