ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుందని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్ స్పష్టం చేశారు. అనంతపురంలో జరిగిన 10వ యువభేరీ కార్యక్రమంలో పాల్గొన ఆయన మాట్లాడుతూ హోదాపై సీఎం చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్ చేయడం లేదని విమర్శించారు. హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ రెండు బంద్‌లకు పిలుపు ఇచ్చిందని.. ఆ బంద్‌లకు ప్రభుత్వం మద్దతు తెలపలేదని గుర్తు చేశారు.
బంద్ జరిగితే ప్రత్యేక హోదా వస్తుందని అందరం ఆరాటపడుతుంటే... బంద్ ఎలా విఫలం చేయాలని చంద్రబాబు ఆలోచనలు సాగాయని జగన్ విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీనే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధినేత జగన్ ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
ఇప్పుడే రాజీనామా చేయడంలో అర్థం లేదని, తాము రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా విషయమై పార్లమెంట్‌లో మాట్లాడేవారే ఉండరని ఓ ప్రశ్నకు సమాధానంగా వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేసిన తర్వాత, తమ పదవులకు రాజీనామా చేస్తే ఉపయోగం ఉంటుందన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని, జగన్ చెప్పిన వెంటనే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తామని చెప్పుకొచ్చారు.