స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతిపితను స్మరించుకుందాం..

FILE
"ఇటువంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు"

"మన తరంలో రాజకీయవేత్తలందరికంటే కూడా గాంధీ అభిప్రాయాలు మేలైనవి. ఆయన చెప్పినట్లుగా మనం నడచుకోవాలి.

మనకు కావలసినదాని కోసం హింసతో పోట్లాడటము కాదు. అన్యాయమని మనకు తోచినదానికి ఏ మాత్రమూ సాయము చేయకుండా ఉండటము మన బాధ్యత" - ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్.

పై వాక్యాలు జాతిపిత మహాత్మా గాంధీ గురించి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పేర్కొన్నవి. భారత దేశపు స్వాతంత్ర్య దినోత్సవం గా ఆగస్టు 15 జరుపుకోబడుతోంది. 1947 ఆగష్టు పదిహేనున భారత దేశం వందల ఏళ్ళ బ్రిటిష్ బానిసత్వం నుంచి విడుదలైన రోజు అది. ఆ రోజుకు గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగష్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.

బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులకు విముక్తి కలిగించి వారిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన గాంధీజీ (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ)ని గురించి తెలియని వారంటూ ఉండరు. శాంతి ఆయుధాన్ని చేతబూని స్వాతంత్ర్యం సంపాదించిపెట్టిన జాతిపిత సత్యము, అహింసలను దేవతలుగా కొలిచారు.

ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము మహాత్మా గాంధీ.. పూజాసామాగ్రి. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా కేబుల్ న్యూస్ నెట్‌వర్కర్, యూఎస్ఎ (సిఎన్ఎన్) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు.

కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న గాంధీజీని 62వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్మరించుకుందాం.. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...!

వెబ్దునియా పై చదవండి