ముఖ్యంగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చివరి రోజున సెంటిమెంట్ రగిలిస్తున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, తెరాస చీఫ్ కేసీఆర్‌లను దొంగల ముఠాతో అభివర్ణించారు. అదేసమయంలో తాను కొందరివాడిగా ఉండనని, అందరివాడిగా ఉంటానని హామీ ఇచ్చారు .
175 స్థానాల్లో తననే అభ్యర్థిగా భావించి... తెలుగుదేశాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్‌లను తన గుప్పిట్లో పెట్టుకొని నీళ్లు రాకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
పోలవరం నిర్మాణంతో మునిగిపోతుందంటున్న భద్రాచలంను తమకు ఇచ్చేయాలన్నారు. భద్రాచలంను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసని చంద్రబాబు అన్నారు. తనకు కులం, మతం లేదని, తన కులం అభివృద్ధని, తన మతం సంక్షేమనన్నారు. కొందరివాడిగా ఉండనన్న ఆయన... అందరివాడుగా ఉండాలన్నదే తన లక్ష్యమంటూ ప్రచారంలో సెంటిమెంట్‌ను రాజేస్తూ ముందుకు సాగిపోతున్నారు.