ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో నిరుపేదలకు చెందిన 120 ఇళ్ల కూల్చివేత దారుణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు కూల్చివేత సమాచారం తెలిసిన వెంటనే ఆయన టిడిపి నియోజకవర్గ నేతలతో మాట్లాడి బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
జగన్ రెడ్డి పాలనలో జే ట్యాక్స్ వసూలు కాకపోతే జేసీబీలతో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకొచ్చి రెండేళ్లయినా పేదలకు ఒక ఇల్లు కూడా కట్టలేని సర్కారుకి నిరుపేదల ఇళ్లు కూలగొట్టే అధికారం ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. ఆత్మకూరు గ్రామంలో 40 ఏళ్ల నుంచి రేకుల షెడ్డులు వేసుకుని జీవిస్తున్న 120 నిరుపేద కుటుంబాలను నడిరోడ్డున పడేయడం న్యాయమా అని ప్రశ్నించారు.
ఈ వివాదంలో కోర్టులో వుందని, బాధితులకు అండగా టిడిపి న్యాయపోరాటం సాగిస్తుండగానే ఇలా కూల్చివేత అరాచకపాలనకి నిదర్శనమన్నారు. కోర్టు ఆదేశాలను పాటించకుండా బాధితుల లాయర్‌కి వాట్సప్‌లో సమాచారం పంపి ఇళ్లు కూల్చివేతకి దిగడం ఎవరి ఆదేశాలతో చేశారో సంబంధిత తహశీల్దార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బాధితులతో వారం రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలనే కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి, రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోవడం ఆంతర్యమేంటన్నారు. బాధితుల లాయర్‌కి వాట్సప్‌లో రాత్రి సమాచారం ఇచ్చి, కోర్టుకి సెలవైన ఆదివారం చూసుకుని, కోర్టుకి వెళ్లే అవకాశం లేకుండా చేసి ఇళ్లు కూలగొట్టడం ముమ్మాటికీ కుట్రపూరితంగా, ఎమ్మెల్యే ఆదేశాలతో జరిగిందేనని ఆరోపించారు. బాధితులకు కనీసం ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు కూల్చివేత దారుణమన్నారు.