ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరో ఐఏఎస్ మాజీ అధికారి చినివీరభద్రుడుకి కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు నాలుగు వారాల జైలుశిక్ష విధించింది. అలాగే రూ.2 వేల అపరాధం విధించింది. బీఈడీ కోర్సు అభ్యసించేందుకు ఎస్జీటీలకు అనుమతి నిరాకరిస్తూ అప్పటి విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు మెమో జారీ చేశారు. దీనిపై ఎస్జీటీలు హైకోర్టును ఆశ్రయించగా, ఆ మెమోను గత యేడాది కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
అయితే, కోర్టు ఆదేశాలను విద్యాశాఖ అధికారులు అమలు చేయలేదు. దీంతో ఎస్జీటీలు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ధిక్కరణగా భావించిన కోర్టు చినవీరభద్రుడుకి నాలుగు వారాల జైలుశిక్షతోపాటు రూ.2 వేల అపరాధం విధించింది. ఈ కేసు విచారణకు హాజరైన పాఠశాల విద్యాశాఖ అధికారులు న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పినప్పటికీ హైకోర్టు పట్టించుకోలేదు. అయితే, ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యర్థనతో జైలుశిక్ష అమలును మాత్రం రెండు వారాల పాటు వాయిదావేసింది.