60 సీట్లు 70 సీట్లు తీసుకోవడం కాదు, గెలిస్తేనే తీసుకోవాలి: పవన్ కల్యాణ్

ఐవీఆర్

శనివారం, 24 ఫిబ్రవరి 2024 (13:55 IST)
పొత్తులో భాగంగా జనసేన ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 24 స్థానాలు తీసుకోవడంపై కొందరు పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేసారు. దీనిపై పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. సీట్లు తీసుకోవడం ముఖ్యం కాదు, ఆ సీట్లలో మనం గెలుస్తామా లేదా అన్నది చూడాలి. గెలుపుకి అవకాశం లేకుండా వున్నచోట గెలిచే పార్టీని పోటీలో లేకుండా చేస్తే ప్రత్యర్థికి అవకాశం ఇచ్చినట్లవుతుంది.
 
గతంలో కూడా అదే జరిగింది. అందుకే ఈసారి ఏ ఒక్క స్థానాన్ని కూడా కోల్పోదలచుకోలేదు. ఏపీ అభివృద్ధే నా ప్రధమ కర్తవ్యం కనుక సీట్లు గురించి కాకుండా అభివృద్ధి కోసం పొత్తులో భాగంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లోనైనా గెలిచి వుంటే ఈసారి అనుకున్నన్ని స్థానాలను ఆశించే స్థాయిలో జనసేన వుండేదని వెల్లడించారు. ఏదేమైనప్పటికీ కూటమి బలంగా వుండాలన్న ఆకాంక్షతో తను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
 
తొలి అభ్యర్థుల జాబితా: 94 స్థానాల్లో తెదేపా-24 స్థానాల్లో జనసేన
తెదేపా-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు-పవన్ కల్యాణ్ ఇద్దరూ విడుదల చేసారు. తొలి దఫా లిస్టులో 118 అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో 94 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
 
జనసేన 24 స్థానాల నుంచి పోటీ చేస్తుంది. మాఘ పౌర్ణమి సందర్భంగా ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పాలని తాము ఈరోజును ఎంపిక చేసుకున్నట్లు చంద్రబాబు నాయుడు అన్నారు. తాము ఏపీ అభివృద్ధి ధ్యేయంగా, ప్రజా శ్రేయస్సు కోసం పొత్తుతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అంతకుముందు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ఏపీ అభివృద్ధి తెదేపా-జనసేన-భాజపా కూటమితో సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని తిరోగమనం దిశకు తీసుకెళుతున్న పాలనకు చరమగీతం పాడేందుకు తాము కలిసికట్టుగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
 
కాగా ఈ లిస్టులోనే కీలక నాయకులు పోటీ చేసే స్థానాలను కూడా ఖరారు చేసారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన భీమవరం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే మంగళగిరిలో పరాజయం పాలైన నారా లోకేష్ ఈసారి కూడా అక్కడి నుంచి పోటీకి దిగుతున్నారు. చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి బరిలోకి దిగుతున్నారు. అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి, జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపి పొత్తు, సీట్ల సర్దుబాటు చేసుకుని మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలియజేసారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు