ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అవినీతి అధికారుల పనిపట్టబోతున్నామని సీఎం ప్రకటించారు.
అధికారులు, నాయకులు ఉన్నది ప్రజలపై అధికారం చెలాయించడానికి కాదని… కేవలం సేవ చేయడానికి మాత్రమేనని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇది తనతో సహా అందరికీ వర్తిస్తుందన్నారు. మనం కేవలం ప్రజాసేవకులం మాత్రమేనన్న అంశాన్ని తన వద్ద పనిచేసే సిబ్బంది నుంచి కింది స్థాయి అధికారుల వరకు గుర్తించాల్సిందేనన్నారు.
అవినీతికి ఇక చోటు లేదన్న అంశాన్ని అందరూ గుర్తించుకోవాలన్నారు. అవినీతిపై పోరాటంలో అగ్రెసివ్‌గా చర్యలు తీసుకోబోతున్నామని ప్రకటించారు. అంతటితో ఆగకుండా రెండు మూడు వారాల్లో పెద్దెత్తున ఏసీబీని రంగంలోకి దింపుతున్నామని సీఎం స్వయంగా ప్రకటించారు. ఏసీబీ ఇకపై మరింత చురుగ్గా పనిచేస్తుందని సీఎం చెప్పారు. అవినీతికి అస్కారం లేదన్న అంశం కింది స్థాయి అధికారుల వరకు చేరాలన్నారు.