విశాఖలో అఖిల భారత చేనేత వస్త్ర ప్రదర్శన.. 7 రాష్ట్రాలకు చెందిన 70 చేనేత హస్తకళా సంఘాలు హాజరు
గురువారం, 17 డిశెంబరు 2020 (07:46 IST)
విశాఖపట్నం మధురవాడ శిల్పారామంలో రాష్ట్ర శిల్పారామం సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 30 వరకూ అఖిల భారత హేండ్లూమ్స్ క్రాప్ట్స్ మేళా-2020 నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు.
విశాఖపట్నంలో 15రోజుల పాటు నిర్వహించే అఖిల భారత చేనేత వస్త్ర ప్రదర్శన (హేండ్లూమ్స్ క్రాప్ట్స్ మేళాను)ను వర్ట్సువల్ విధానం ద్వారా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ... కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ హేండ్లూమ్స్ డెవలప్మెంట్ కమీషనర్ సహకారంతో 30 వరకూ 15రోజులపాటు నిర్వహిస్తున్నారు.
ఈ అఖిల భారత హేండ్లూమ్స్ క్రాప్ట్స్ మేళా-2020లో దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణా రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్,పశ్చిమ బెంగాల్,ఢిల్లీ, ఉత్తరాఖాండ్ తదితర ఏడు రాష్ట్రాలకు చెందిన సుమారు 70 చేనేత హస్తకాళాకారుల సంఘాలు పాల్గొంటున్నాయని ఆయన వివరించారు. చేనేత హస్త కళాకారులు తయారు చేసిన వివిధ వస్తువులు,వస్త్రాలకు పెద్దఎత్తున మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించేందుకు ఇలాంటి ప్రదర్శన(మేళాలు) ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో చేనేత హస్తకళా ప్రదర్శన(ఎగ్జిబిషన్)లను ఏర్పాటు చేయడం ద్వారా చేనేత హస్తకళా వస్తువులకు వస్త్రాలకు మరిన్ని మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకోనుందని స్పష్టం చేశారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత హస్తకళాకారులను ఆదుకునేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నాయని మంత్రి పేర్కొన్నారు.
ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బిసి కులాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారి కోసమే 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.వీటి ద్వారా వివిధ బిసి కులాలకు చెందిన వారంతా రానున్న రోజుల్లో ఆర్ధికంగా సామాజికంగా రాజకీయ పరంగా మరింత అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.
చేనేత హస్తకళాకారులు తయారు చేసే ప్రతి వస్తువును,వస్త్రానికి పూర్తి స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని పర్యాటక సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పునరుద్ఘాటించారు.