ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, పోస్టులు పెట్టే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పోస్ట్ పెట్టారన్న ఆరోపణలపై 66 యేళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన పేరు వట్టికూటి నరసింహారావు. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం.
ఈయన తన కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. 'మీకు కొవిడ్ పరీక్ష చేయాలి' అంటూ ఆరోగ్య కార్యకర్త పేరిట సీఐడీ పోలీసులు ఆ కాల్ చేశారు. ఆయన అడ్రస్, ఇతర వివరాలను తీసుకొన్నారు. అయితే అప్పటికే ఆ పరీక్ష చేయించుకొని ఉండటంతో నరసింహారావుకు అనుమానం వచ్చింది.
'ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పోస్టులు పెడుతున్నారు. మిమ్మల్ని అరెస్టు చేస్తాం' అంటూ గురువారం ఉదయం డీఎస్పీ పేరుతో మరో ఫోన్ వచ్చింది. సాయంత్రానికి అదుపులోకి తీసుకొన్నారు. అయితే, తాను పోస్టు పెట్టలేదని, ఎవరో పంపించిన పోస్టును ఫార్వర్డ్ మాత్రమే చేశానని నరసింహారావు తెలిపారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం అరెస్టు చేశారు. జైలుకు తరలించారు.