హైదరాబాద్: ఏపీ సీఎం పదేపదే చెపుతున్న అమరావతి నిర్మాణానికి బ్రేక్ పడింది... ఏపీ కొత్త రాజధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో విదేశీ కాంట్రాక్ట్ నిబంధనలను న్యాయస్థానం వ్యతిరేకించింది. దీనితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. రాజధాని అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం అనురిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టు స్టే విధించింది. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది.
తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విధానాన్ని ఇందులో కొన్ని అభ్యంతరకరమైన నిబంధనల్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై ఆంధ్రప్రదేశ్ తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రపంచ స్థాయి నగర నిర్మాణం కోసమే స్విస్ ఛాలెంజ్ పద్ధతి పాటిస్తున్నట్లు చెప్పారు.
అయితే, ఇందులో కొన్ని మన దేశ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని న్యాయస్థానం భావించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానాన్ని ఎంచుకోవడాన్ని ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్, చెన్నైకు చెందిన ఎన్వీఎన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యతిరేకిస్తూ, న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది.