ప్రజల బాగోగులు తెలుసుకుంటూ... పల్లెబాట పట్టిన సోమిరెడ్డి

బుధవారం, 22 డిశెంబరు 2021 (19:00 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయ నాయకులు అపుడే వ‌చ్చే ఎన్నిక‌ల‌ను టార్గెట్ చేసేస్తున్నారు. ఇంకా రెండున్న‌ర ఏళ్ళు స‌మ‌యం ఉన్నా, అపుడే ముంద‌స్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా మాజీ మంత్రి, సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి ప్రజల బాగోగులు తెలుసుకుంటూ అపుడే పర్యటన ప్రారంభించారు. పొదలకూరు పంచాయతీ చిట్టేపల్లిలో పర్యటనకు శ్రీకారం చుట్టారు.

 
చిట్టేపల్లి, తోకంచిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటనకు విశేష స్పందన ల‌భించింది. వైసీపీ ప్రభుత్వ పాలనపై ఆయ‌న ఛ‌లోక్తులు విసురుతుండ‌గా, తాము ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను ప్రజానీకం ఏకరవుపెడుతున్నారు. ప్రజావ్యతిరేక పాలనకు కాలం చెల్లిపోయే రోజు దగ్గరపడిందని, త్వరలోనే మంచి రోజులొస్తాయని ధైర్యం చెబుతూ సోమిరెడ్డి ముందు సాగుతున్నారు. 
 
 
వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ బాధితులే అని సోమిరెడ్డి కామెంట్స్ చేస్తున్నారు. పొదలకూరు మండలంలో ప్రధానంగా రెవెన్యూ శాఖ అవినీతికి, ల్యాండ్ మాఫియాకు అడ్డాగా మారిపోయింద‌ని పేర్కొన్నారు. తహసీల్దారుగా పనిచేసిన స్వాతి ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడి ప్రభుత్వ భూములను కూడా కొందరికి దారాధత్తం చేశార‌ని ఆరోపించారు. అక్రమాలు జరిగాయని ఓ వైపు తహసీల్దారు, మరోవైపు జిల్లా కలెక్టరు అంగీకరించినా ఈ రోజుకీ చర్యలు లేవ‌న్నారు. చిల్లకూరులో అక్రమాలు బయటపడగానే తహసీల్దారుతో పాటు పలువురిపై  క్రిమినల్ కేసులు బనాయించార‌ని, పొదలకూరు తహసీల్దారును మాత్రం సీసీఎల్ఏకు పంపార‌ని తెలిపారు. ఎమ్మెల్యే అండ ఉంటే ప్రత్యేక రక్షణ కల్పిస్తారా? పొదలకూరులో అక్రమాలు జరిగాయని జిల్లా కలెక్టరే ఒప్పుకున్నా ఇంకా చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటి అని ప్ర‌శ్నించారు.
 
 
స్వాతి తర్వాత తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టిన పద్మావతి నిజాయతీగా పనిచేస్తుంటే, ఆమెను బదిలీ చేసేశార‌ని, నిజాయతీగా పనిచేసే అధికారులను సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండనీయరా అని ప్ర‌శ్నించారు. జనవరిలో జరుగుతున్న ఓటరు నమోదు ప్రక్రియ వరకు తహసీల్దారులను బదిలీ చేయకూడదనే మార్గదర్శకాలనూ తుంగలో తొక్కార‌ని సోమిరెడ్డి ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు