వీరికి పింఛను నగదు చెల్లింపులకుగాను నెలకు రూ.1.939 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఏప్రిల్ నుంచే రూ.4 వేల పింఛను పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి రూ.7 వేలు (జులై 1న ఇచ్చే పింఛను రూ.4 వేలు+ ఏప్రిల్ నుంచి రూ.వెయ్యి చొప్పున రూ.3 వేలు) చొప్పున, దివ్యాంగులకు రూ.6 వేల పింఛనుకు జులై 1వ తేదీన పంపిణీ చేయడానికి రూ.4,400 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఆగస్టు నుంచి అయితే నెలకు రూ.2,800 కోట్లు వ్యయం అవుతుందని లెక్కగట్టారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించనున్నారు. దివ్యాంగ పింఛనుదారులు రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నారు. వీరు ప్రస్తుతం రూ.3 వేలు పింఛను తీసుకుంటున్నారు.
వీరి పింఛనును రూ.6 వేలకు పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇవికాకుండా పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేల పింఛను, కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల పింఛను అందించేందుకు ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారనే వివరాల్ని వైద్యశాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు సేకరిస్తున్నారు.