తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకునే అంగప్రదక్షిణ టిక్కెట్ల కేటాయింపులో ప్రస్తుత విధానానికి స్వస్తి చెప్పి పాత విధానాన్ని తిరిగి అమల్లోకి తీసుకునిరానుంది. ఇప్పటివరకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ విధానం ద్వారా ఈ టిక్కెట్లను కేటాయిస్తూ వచ్చారు. అయితే, ఇక నుంచి లక్కీ డిప్ ద్వారా ఈ టిక్కెట్లను కేటాయించనున్నారు. డిసెంబరు కోటాకు సెప్టెంబరు 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఒకసారి ఈ టిక్కెట్లను పొందినవారు 180 రోజుల తర్వాతే ఈ టిక్కెట్లను కేటాయించనున్నారు.
ఇప్పటికే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదశ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవలకు తితితే ఆన్‌లైన్ లక్కీడిప్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు ఈ జాబితాలో అంగప్రదక్షిణ సేవలను కూడా చేర్చింది. ఇకపై భక్తులు మూడు నెలల ముందుగానే ఈ లక్కీ డిప్ కోసం ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ కొత్త విధానం ప్రకారం డిసెంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల కోసం భక్తులు సెప్టెంబరు 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తితిదే సూచించింది. లక్కీడిప్‌లో ఎంపికైన భక్తులు వివరాలను వెల్లడించి, వారికి టోకెన్లను కేటాయిస్తారు. శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో 750 టోకెన్లు, శనివారం మాత్రం 500 టోకెన్లు అందుబాటులోఉంచనున్నట్టు అధికారులు తెలిపారు.
దీంతోపాటు మరో కీలక నిబంధను కూడా తితిదే అమల్లోకి తెచ్చింది. గతంలో ఒకసారి అంగప్రదక్షిణ సేవలో పాల్గొన్న భక్తులు మళ్లీ 90 రోజుల తర్వాత బుక్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే, ఎక్కువ మంది భక్తులకు ఈ అవకాశం కల్పించే ఉద్దేశ్యంతో ఈ గడువును 180 రోజులకు పెంచినట్టు ప్రకటించింది. భక్తులు ఈ మార్పులను గమనించి, తితిదేకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.