గిరిజన యువతకు ఉపాధి కల్పన కోసం శిక్షణాకేంద్రం : మంత్రి పుష్పశ్రీవాణి

మంగళవారం, 17 డిశెంబరు 2019 (13:58 IST)
శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో ఆంధ్రా బ్యాంకు, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా భవనాలు జీసీసీకు సంబంధించిన పార్కు స్ధలంలో ఉన్నాయా అని అడిగిన సభ్యుల ప్రశ్నకు సమాధానంగా ఆ భూమి జీసీసీకి సంబంధించినది కాదని ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పుష్పశ్రీవాణి స్పష్టంచేశారు. అదేవిధంగా సీతంపేట ఐటిడిఏ పరిధిలో కొత్తూరు గ్రామ పరిధిలో 1210 చదరపు గజాలు ఖాలీ స్ధలం ఒకటి మాత్రమే ఉందని, దానిలో స్ధానిక గిరిజన యువతకు ఉపాధి కల్పన కోసం కావాల్సిన శిక్షణా తరగతులకు సంబంధించి ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయడం జరిగిందన్నారు. 
 
అదేవిధంగా జీసీసీకు సంబంధించిన శాశ్వత స్ధలాలు ఎక్కడా ఆక్రమణకు గురికాలేదని స్పష్టంచేశారు. కొన్ని చోట్ల రోడ్డు పక్కన చిన్న, చిన్న స్ధలాల్లో షాపులు పెట్టుకోవడం జరిగిందన్నారు. 5 అటవీ ఫలఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం మద్ధతు ధర ప్రకటించిందన్న డిప్యూడీ సీఎం, ఇంకా కొన్ని అటవీ ఉత్పత్తులకు మద్ధతు ధర కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున మరికొన్ని ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగిందని చెప్పారు. 
 
గిరిజన ప్రాంతాల్లో శాశ్వత నిర్మాణాల కోసం 2019-20 ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌ కింద కొన్ని నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించామన్నారు. అందులో రూ.13.8 కోట్లతో 33 ఎల్‌పిజి గ్యాస్‌ గోడౌన్లు నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వగా, రూ.12.75 కోట్ల రూపాయలతో 17 కొత్త గోదాముల నిర్మాణం కొరకు, రూ.4.50 కోట్లతో శీతల గిడ్డంగులు నిర్మాణాల మిగులు పనులు చేయుట కొరకు, అదేవిధంగా రూ.2.88కోట్లతో 48 అసంపూర్తిగా ఉన్న డిఆర్‌ డిపోల పనులు పూర్తి చేయుట కొరకు, రూ.26.83 కోట్లతో గిరిజన సహకార సంస్థ ప్రధాన కార్యాలయం, విశాఖపట్నంలో నిర్మాణం కొరకు ఉద్ధేశించిన ప్రతిపాదనలన్నీ నోడల్‌ ఏజెన్సీ పరిశీలనలో ఉన్నాయని వివరించారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించి, నిధుల కేటాయింపు మంజూరు కావాల్సి ఉందని సభకు తెలియజేశారు. 
 
అటవీశాఖ అధికారుల వల్ల గిరిజనులు ఇబ్బంది పడుతున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీనికోసం అటవీ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించమని సీఎం వైయస్‌.జగన్‌ చెప్పారని, త్వరలోనే అటవీ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం పెట్టి, గిరిజనుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. 
 
మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో శిథిలావస్థలో  ఉన్న భవనాలు మరమ్మత్తులు కోసం ప్రతిపాదనలు పెట్టి, ఖచ్చితంగా వాటిని రిపేర్‌ చేయిస్తామన్న డిప్యూటీ సీఎం, ఆశ్రమ పాఠశాలల్లో సమస్యల పరిష్కరించడంతో పాటు, యానాదుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు