ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీయే నూతన కార్యాలయ భవనాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, పి.నారాయణతో పాటు పలువురు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
కాగా, సీఆర్డీయే భవనం 3.07 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం 4.32 ఎకరాల్లో రూ.257 కోట్ల వ్యయంతో జీ ప్లస్ ఏడు అంతస్తుల్లో భవన నిర్మాణాన్ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఈ భవనంలో ఏకంగా 300 వాహనాలు పార్కింగ్ చేసేలా సదుపాయం కల్పించారు.
భవనం ముందు భాగాన్ని "ఏ" ఆకారంలో తీర్చిదిద్ది అమరావతికి ప్రతీకగా నిలిచేలా డిజైన్ జేశారు. అదనంగా 100 అడుగుల ఎత్తైన జాతీయ జెండా స్తంభాన్ని ఏర్పాటుచేశారు. గత 8 నెలలుగా నిరంతరాయంగా నిర్మాణ పనులు కొనసాగా, రోజువారీగా 500 మందికిపైగా కార్మికులు, ఇంజనీరులు, సాంకేతిక నిపుణులు ఈ పనుల్లో పాల్గొన్నారు.
ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, మొదటి అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్, 2, 3, 5 అంతస్తుల్లో సీఆర్డీయే ప్రధాన కార్యాలయం, 4 అంతస్తులో మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ కార్యాలయం, 6వ అంతస్తులో ఏడీసీఎల్ కార్యాలయం, 7వ అంతస్తులో మున్సిపల్ శాఖామంత్రి, ముఖ్య కార్యదర్శి కార్యాలయాలను ఏర్పాటుచేశారు. ఈ భవనం ప్రారంభం తర్వాత ఇకపై రాజధాని అమరావతి నిర్మాణ పనులన్నీ ఇక్కడ నుంచే నిర్వహించనున్నారు. రాజధాని అభివృద్ధిలో ఈ భవన ప్రారంభోత్సవం కీలక మైలురాయిగా భావిస్తున్నారు.