ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణా వాడేస్తోంది: ప్రధానికి ఏపీ సీఎం ఫిర్యాదు

బుధవారం, 7 జులై 2021 (18:44 IST)
ఏపీ-తెలంగాణ జల వివాదాలపై ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోమారు లేఖ రాశారు. పదేపదే జలశక్తి శాఖకు, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా వివాదాలు పరిష్కారం కావటం లేదని లేఖలో సీఎం పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణా వాడేస్తోందని దీన్ని తక్షణం ఆపేలా చర్యలు చేపట్టాలని లేఖలో ముఖ్యమంత్రి జగన్ కోరారు. 
 
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి తెలంగాణా రాష్ట్రం అక్రమంగా నీటిని వాడేయటం వల్ల ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని జగన్ ప్రస్తావించారు. ప్రాజెక్టుల్లో తెలంగాణా రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటం వల్ల విలువైన నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తిందని స్పష్టం చేశారు.
 
ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి పంపకాల విషయంలో కృష్ణా నదీయాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ లాంటి యంత్రాంగాలు ఉన్నప్పటికీ తెలంగాణా యధేచ్చగా నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని లేఖలో సీఎం పేర్కోన్నారు. 
 
తక్షణం తెలంగాణా చేస్తున్న నీటి వినియోగాన్ని నిలువరించకపోతే ఏపీ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని లేఖలో జగన్ ప్రధానికి తెలిపారు. విభజన చట్టం ప్రకారం హక్కుగా ఏపీకి చెందాల్సిన నీటి వాటా విషయంలో నష్టపోవాల్సి వస్తుందని సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.
 
సాగునీటికి సంబంధించిన అవసరాలు ఉన్నప్పటికీ తెలంగాణా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటం రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల దిగువన నీటిని ఏపీ వినియోగించుకోలేదని తెలిసీ తెలంగాణా విద్యుత్‌ను ఉత్పత్తి చేయటం దారుణమని సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో ఆరోపించారు. 
 
జూన్ 1 తేదీ నుంచి 26 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తే అందులో 19 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులపై కెఆర్ఎంబీతో పాటు సీఐఎఎస్ఎఫ్ రక్షణ కల్పించేలా ఆదేశించాలని ప్రధాని మోదిని ముఖ్యమంత్రి జగన్ లేఖలో కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు