పవన్ అంటే గాలి... గాలి... గాలి వార్తలను నమ్మే వ్యక్తి: కేఈ ఘాటు వ్యాఖ్య
శుక్రవారం, 22 జూన్ 2018 (17:04 IST)
తిరుమల విషయంలో అందరూ గాలి వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఎవరూ ఆధారాలు చూపించడం లేదు. ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు ఉపముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి. బి.జె.పి, వై.సి.పి, జనసేన పార్టీలు తిరుమల తిరుపతిని వేదికగా కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజాక్షేత్రంలోకి వచ్చినవాళ్లు బాధ్యతతో వ్యవహరించాలి. ప్రజలని తప్పుదోవ పట్టించకూడదన్నారు. పవన్ అంటే గాలి... గాలి వార్తలను నమ్మి, వాటిని వల్లించడం తప్ప, స్వయంగా వివేకంతో విశ్లేషించే శక్తి పవన్‌కు లేదన్నారు.
ఎవరో ఏదో చెబితే అదే నిజం అనుకొని, ప్రజలకు చెప్పడం ఆయన అనుభవరాహిత్యానికి నిదర్శనం. ఆవిర్భావ సభ సంధర్భంగా ముఖ్యమంత్రిగారి మీద, లోకేష్ మీద తీవ్ర ఆరోపణలు చేసి, ఎవరో చెబితే తను చెప్పాననడం ఆయన వైఖరిని తెలియజేస్తుందన్నారు. రీల్ లైఫ్ వేరు... రియల్ లైఫ్ వేరు. సినిమాలో ఎవరో రాసిన స్క్రిప్టుని హావభావాలతో వల్లిస్తున్నారుని, నిజజీవితంలో ఇది కుదరదని గ్రహించాలన్నారు.
బిజేపీ- వైసీపీ తానా అంటే పవన్ కళ్యాణ్ తందానా అంటున్నారు, పవన్ ట్వీట్లు చూస్తే వైసీపీ, బిజేపీ చేస్తున్న రాజకీయ కుట్రకు ఆయన వంతపాడుతున్నట్లు కనబడుతుందన్నారు. రాజధాని భూముల విషయంలో పవన్ ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఆ ప్రాంతంలోని 99 శాతం మంది ప్రజలు స్వఛ్చందంగా భూములు ఇచ్చిన సంగతి ఆయన గుర్తుంచుకోవాలన్నారు.
తిరుమల దేవస్థానం ప్రతిష్టను మసకబార్చేలా వ్యవహరించిన వ్యక్తులకు మద్దతుగా పవన్ మాట్లాడటం దురదృష్టకరం. తిరుమల తిరుపతి దేవస్థానం నగలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అపహరణకు గురయ్యాయని తనకు సీనియర్ ఐ.పి.యస్ చెప్పాడని మాట్లాడుతున్న పవన్, అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీనియర్ అధికారి పేరు బయటపెడితే వారి నుంచి మరింత సమాచారం తీసుకుంటామన్నారు.
విశ్వసనీయత లేని రమణ దీక్షితుల మాటలకు విలువలేదని, అలాంటి వ్యక్తికి మద్దతుగా పవన్ కళ్యాణ్ మాట్లాడటం కుట్ర రాజకీయాలను బహిర్గతం చేస్తుందన్నారు. ప్రభుత్వం నియమించిన జస్టిస్ వాద్వా కమిటి, జగన్నాధం కమిషన్ తిరువాభరణాలపై రిపోర్టులు ఇచ్చారు. అవసరమైతే నివేదికలను ప్రజలందరూ చూసేలా అందుబాటులో ఉంచుతామన్నారు. 1952 నుంచి స్వామివారి ఆభరణాలపై ప్రభుత్వం వద్ద రికార్డులు ఉన్నాయని తెలిపారు.
రాయల కాలంలో ఇచ్చిన ఆభరణాల విషయంలో ఏ రాయలు ఎన్ని ఆభరణాలు ఇచ్చారనేదానిపై 1952 ముందు నాటికే ఏ లెక్కలు లేవన్నారు. ఎన్డీఏ నుంచి టిడిపి బైటకు వచ్చాకే తిరుమల తిరుపతి వేదికగా బిజెపి మహా కుట్రకు తెరదీసింది. వైసిపి, జనసేన బిజెపి కుట్రలో సూత్రధారులు అయ్యారఅనేది బహిరంగ రహస్యం అన్నారు. రమణ దీక్షితులు ఎప్పుడైతే వెళ్లి అమిత్ షాను, జగన్మోహన్ రెడ్డిని కలిశారో అప్పుడే కుట్రదారుల గుట్టు రట్టయ్యిందన్నారు. రాజకీయాల కోసం పుణ్యక్షేత్రాన్ని కూడా వదలటంలేదని, ఇదేనా హిందూ ధర్మ సంస్కృతి పట్ల మీకున్న విశ్వాసమని ప్రశ్నించారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో సుధీర్ఘకాలం పాటు ప్రధాన అర్చకులుగా చేసిన రమణ దీక్షితులు స్వామి వారి పట్ల కృతజ్ఞత కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. టిటిడి ప్రతిష్టకు భంగం వాటిల్లేలా రమణదీక్షితులు చేస్తున్న అసత్య ఆరోపణలు, రాజకీయ విమర్శలు పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడుకొండలను రెండు కొండలే అని వైయస్ జీవో నెం. 338 ఇచ్చినప్పుడు, ఆభరణాలు గల్లంతైనప్పుడు, కొండ పైన అన్యమత ప్రచారం జరిగినప్పుడు రమణదీక్షితులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
రమణదీక్షితులు వ్యవహార శైలి గురించి ఇప్పటికే మాజీ టిటిడి ఈవోలు ఎల్వీ సుబ్రమణ్యం, బాల సుబ్రమణ్యం నిజానిజాలు వెల్లడించారని, తాజాగా సామాజికవేత్త ఎన్.వి ప్రసాద్, మాజీ టుడా ఛైర్మన్ భూమన సుబ్రమణ్యం రెడ్డి వాస్తవాలను బైటపెట్టారని గుర్తుచేశారు. రమణదీక్షితులు హైదరాబాద్ ప్రెస్ మీట్లో అన్యమతస్థుడైన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నారని, అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయని, దీని గురించి నిలదీస్తే రమణ దీక్షితులు ఎందుకు జవాబు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కుట్ర రాజకీయాలు మానుకోవాలని, బిజేపి రాజకీయ క్రీడలో పావుకావద్దని రమణదీక్షితులను కోరారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకే తిరుమల తిరుపతిలో వ్యవస్థలను పటిష్టం చేశామని, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లు, నిత్యాన్నదానం ప్రవేశపెట్టాము. కాలినడక మార్గం ఆధునీకరణ, కొండపైకి తెలుగు గంగ నీరు తేవడం, స్విమ్స్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, రోడ్ల అభివృద్ధి, విద్యుత్ సరఫరా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేశాం. వ్యవస్థలలో క్రమశిక్షణ తెచ్చామన్నారు. ఎన్టీఆర్‌కు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి ఇంటి ఇలవేలుపు, ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అలిపిరి దుర్ఘటనలో చంద్రబాబు ప్రాణాలను ఆ దేవదేవుడే కాపాడాడని ప్రగాఢంగా నమ్ముతారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా ఎప్పుడు తిరుమల వెళ్లినా తనతోపాటు వచ్చిన అందరికీ టిక్కెట్లు తీసుకుని మరీ స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆలయ ప్రాంగణంలో అత్యంత భక్తిప్రపత్తులతో మెలగడం ఎన్టీఆర్‌కు, చంద్రబాబుకు తొలి నుంచి ఉన్న అలవాటు.
అలాంటిది తెలుగుదేశం పార్టీపై కక్ష సాధింపులో భాగంగా మూడు పార్టీలు తిరుమల తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసే చర్యలకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. తిరుమల ప్రతిష్టను, పవిత్రతను దెబ్బతీసేలా కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు మహా కుట్ర చేస్తున్నారు. గత కొంతకాలంగా పరిణామాలను చూస్తుంటే తిరుమల తిరుపతి వేదికగా జరుగుతున్న కుట్ర రాజకీయం తెలిసిపోతుందన్నారు.