పక్కపక్కనే చంద్రబాబు - పవన్ .. అయినా పలుకరింపుల్లేవ్
శుక్రవారం, 22 జూన్ 2018 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు చాలా రోజుల తర్వాత ఒకరిపక్కన ఒకరు కనిపించారు. అయినప్పటికీ వీరిద్దరూ పలుకరించుకోవడం వంటివి లేవు. అసలు వీరిద్దరూ ఒకే చోట ఎక్కడ కలిశారో తెలుసుకుందాం రండి.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు పంచాయితీ పరిధిలోని లింగమనేని ఎస్టేట్స్ సమీపంలో శ్రీ దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఏకశిలా విగ్రహంలో ఏకాదశ రూపాలు కలిగిన 11 అడుగుల ఎత్తున్న వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారు.
ఈ కార్యక్రమంలో దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సహా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
విజయవాడ-గుంటూరు జాతీయ రహదారికి సమీపంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా సువిశాల మైదానంలో సుందరంగా, రమణీయంగా నిర్మితమైన ఆలయంలో దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. ప్రధాన ఆలయానికి మరో నాలుగు ఉపాలయాలు మహాలక్ష్మి, గణపతి, గరుడ ఆళ్వార్, విష్వక్సేనుడు ఉండటంతో దీనిని శ్రీ దశావతార శ్రీనివాస క్షేత్రంగానూ పిలుస్తున్నారు.
ఈ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు పక్కపక్కనే నిలబడ్డారు. వీరి మధ్యలో సచ్చిదానంద స్వామి నిల్చొని పూజలు చేశారు. అయితే, ఈ ఆలయానికి ముందుగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆలయానికి వచ్చారు. మరో 15 నిమిషాల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు.
వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన అనంతరం గణపతి సచ్చిదానంద స్వామి.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ చేత పూజలు చేయించారు. ఆలయాన్ని సందర్శించే సమయంలో పవన్‌కల్యాణ్, చంద్రబాబు కాసేపు పక్కపక్కనే నడిచారు. అయినప్పటికీ ఒకరినొకరు పలకరించుకున్నట్లు కనిపించలేదు. కాసేపటి తర్వాత పవన్‌కల్యాణ్ దూరంగా వెళ్లిపోయారు.
ఆలయంలో కొందరు మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతున్న సమయంలోనూ పవన్ ఆయన పక్కనుంచే వెళ్లినప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఒకేచోటకు రావడంతో వారిని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఆలయానికి చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. అలాగే, ఆలయ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు.