పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

వరుణ్

శనివారం, 15 జూన్ 2024 (16:03 IST)
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ అన్నారు. అలాగే, ఈ యేడాది లోగా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఫేజ్-2, ఫేజ్-3 పనులన్నీ యేడాదిలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై అధికారులను ఆరా తీశారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్‌ను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
 
గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకుగల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జనరల్ డ్రాప్ ఔట్స్ వివరాలు కూడా అందజేయాలన్నారు. ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు గల కారణాలను కూడా తెలియజేయాలన్నారు. దేశంలోనే బెస్ట్ లైబ్రరీ మోడల్ ఎక్కడ ఉందో తెలుసుకుని, సమీక్ష చేసి అందుకు సంబంధించిన నోట్‌ను సిద్ధం చేయాలని తెలిపారు. బైజూస్ కంటెంట్, ఐఎఫ్‌బీ వినియోగం మీద సమగ్ర నోట్‌ ఇవ్వాలని సూచించారు. 
 
విద్యార్థులకు కిట్‌లు అందజేసే ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ఇవ్వాలని ఆదేశించారు. గత ప్రభుత్వం ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ఇవ్వకపోవడం పట్ల లోకేశ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో తెదేపా ప్రభుత్వం కొనుగోలు చేసిన సైకిళ్లను వైకాపా ప్రభుత్వం పంపిణీ చేయకుండా మూలన పడేసిన నేపథ్యంలో వాటి వివరాలు ఇవ్వాలని అధికారులను కోరారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని మంత్రి స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు