సంక్రాంతి సెలవులను కుదించిన సీఎం జగన్ ప్రభుత్వం

మంగళవారం, 5 జనవరి 2021 (09:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులను ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం కుదించింది. ఆ ప్రకారంగా ఈ యేడాది సంక్రాంతి సెలవులు ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మాత్రమే కొనసాగుతాయని రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
మొత్తం 8 రోజుల పాటు సెలవులు ఉండేలా అకడమిక్ క్యాలెండర్ పనిదినాలను సర్దుబాటు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. కరోనా కారణంగా ఇప్పటికీ స్కూళ్లు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదన్న సంగతి తెలిసిందే. 
 
తొలుత పండగ దినాలను మాత్రమే సెలవులుగా ఇవ్వాలని భావించినా, సంక్రాంతి ప్రాధాన్యత, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సెలవులను పెంచారు.
 
కాగా, 10వ తేదీ ఆదివారం, 11న అమ్మఒడి కార్యక్రమం ఉన్నందున హాఫ్ డే వర్కింగ్ డేను ప్రకటించిన అధికారులు, ఆపై 17 వరకూ సెలవుల తర్వాత, 18న పాఠశాలలు తిరిగి తెరచుకుంటాయని స్పష్టం చేశారు. 
 
ఇదేసమయంలో 21 నుంచి జరగాల్సిన 7, 8 తరగతుల ఫార్మేటివ్ పరీక్షలను ఫిబ్రవరి 8కి మార్చినట్టు కూడా అధికారులు వెల్లడించారు. విద్యార్థుల సిలబస్ పూర్తి కాలేదని ఉపాధ్యాయులు పేర్కొన్న నేపథ్యంలోనే పరీక్షలను వాయిదా వేస్తున్నామని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి డైరెక్టర్ బి. ప్రతాప్ రెడ్డి వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు