ఇంటింటికీ రేషన్ పథకం ఓకేగానీ... హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆదివారం, 31 జనవరి 2021 (15:54 IST)
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ పథకానికి రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపింది. అయితే, రాజకీయ పార్టీలు, నేతల జోక్యం లేకుండా పథకం నిర్వహించాలని ఆదేశిస్తూ... దీనికి సంబంధించిన ప్రణాళిక తయారు చేసుకుని రెండు రోజుల్లో ఎస్ఈసీని కలవాలని స్పష్టం చేసింది.
 
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో వుంది. దీంతో ఇంటింటికీ రేషన్ పథకం అమలుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పలు నిబంధనలు విధించింది. ఈ పథకానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. కొద్దిసేపటి క్రితం పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. 
 
ఐదు రోజుల్లో ఈ అంశంపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. రాజకీయ పార్టీల రంగులు ఉండకూడదని స్పష్టంచేసింది. ప్రజా సంక్షేమ పథకాలు సొంత డబ్బులతో ఎవరూ చేయరని... ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో పథకాలు నిర్వహిస్తారనేది గుర్తుంచుకోవాలని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
పేద ప్రజల కోసం పథకం కాబట్టి ఎస్ఈసీ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అంతకుముందు రాజకీయ పార్టీల రంగుల్లేకుండా పథకం నిర్వహించుకోవచ్చని ఎస్‌ఈసీ సూచించింది. దీనిపై ఏపీ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
 
ఇదిలావుంటే, కృష్ణా జిల్లా అర్బన్‌ ప్రాంతంలోని 560 చౌక దుకాణాల నుంచి మొబైల్‌ వాహనాల్లో ఇంటికే రేషన్‌ సరుకులు సోమవారం నుంచి అందజేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీలత తెలియజేశారు. కార్డుదారులకు బియ్యం, కందిపప్పు, పంచదార మొబైల్‌ వాహనాల ద్వారా ఫిబ్రవరి 1 నుంచి అందిస్తామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు