బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అరెస్టు తప్పదా?

వరుణ్

గురువారం, 13 జూన్ 2024 (16:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కూలిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గత ప్రభుత్వంలో రాజకీయ నేతల అండతో రెచ్చిపోయిన బ్యూరోక్రాట్ల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ముఖ్యంగా, అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన ఐఏఎస్, ఐపీఎస్‌లు మరింతగా వణికిపోతున్నారు. ఇలాంటి వారిలో ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ, ఐఆర్‌టీఎస్ అధికారి డి.వాసుదేవరెడ్డి మొదటి వరుసలో ఉన్నారు. కీలక డాక్యుమెంట్లు మాయం చేశారంటూ డి.వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేసింది. 
 
అయితే, ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వాసుదేవ రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 18వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు, వాసుదేవ రెడ్డికి మధ్యంతర బెయిల్‌ ఇవ్వొద్దని సీఐడీ తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. అనంతరం పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన కోర్టు.. ఈ లోపు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది.
 
ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్‌ పరికరాలు, ఇతర పత్రాలను వాసుదేవ రెడ్డి ఈ నెల 6న కారులో తరలిస్తుండగా చూశానంటూ.. కంచికచర్ల వాసి గద్దె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ కేసు పెట్టింది. విలువైన ఆధారాలు, వస్తువుల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలపై ఐపీసీ 427, 379 రెడ్‌విత్‌ 120బీ సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు