సోలార్ పవర్ ప్రాజెక్టు టెండర్లు చట్ట విరుద్ధం : ఏపీ సర్కారు హైకోర్టు షాక్

శుక్రవారం, 18 జూన్ 2021 (12:15 IST)
మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరో గట్టి  ఎదురుదెబ్బ తగిలింది. మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు టెండర్ రద్దు చేయాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కొనుగోళ్లు (పీపీఏ) సైతం తాజాగా రూపొందించాలని స్పష్టం చేసింది.
 
పవర్ ప్రాజెక్టు టెండర్లు కేంద్ర విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ విద్యుత్ నియంత్రణ చట్టం విచారణాధికారి హక్కుల పరిధిని పీపీఏలో తొలగించడం చట్ట విరుద్ధమని టాటా ఎనర్జీ సంస్థ పేర్కొంది. 
 
ఈ ఒప్పందంలో వివాదం వస్తే నియంత్రణ మండలి కాకుండా ప్రభుత్వమే సమస్యను పరిష్కరించేలా ఇది వీలు కల్పిస్తుందని, ఇది టెండర్ మార్గదర్శకాలకు విరుద్ధమని టాటా ఎనర్జీ తన వాదనలు వినిపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు తీర్పు వెలువరించింది.
 
నిజానికి ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా భారీగా సౌర విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ సర్కారు ముందుకెళ్లింది. ఇప్పుడు తేరుకోలని షాక్‌ తగిలింది. సోలార్‌ పవర్‌పై జగన్‌ విపక్షంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ప్రదర్శించిన వైఖరిని తర్వాత పక్కనపెట్టారు. గత టీడీపీ ప్రభుత్వం అనవసరంగా సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహించిందని, అవసరానికి మించి వాటి ఉత్పత్తిని ఆమోదించి రాష్ట్రంపై భారం మోపిందని ముఖ్యమంత్రి అయిన కొత్తలో జగన్‌ విమర్శలు గుప్పించారు. 
 
తర్వాత ఏకంగా 6400 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించి టెండర్లు పిలిచారు. ఇందులోనే రాష్ట్ర ప్రభుత్వం మరో వెసులుబాటు కూడా కల్పించింది. టెండర్‌ దక్కించుకొన్న వారు అదే ధరకు మరో 50 శాతం అదనపు సామర్థ్యంతో ప్రాజెక్టులు పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. అంటే, ఈ టెండర్ల ద్వారా ఏకంగా ఒకేసారి పది వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి తలుపులు తెరిచినట్లయింది. 
 
దీనిపై విద్యుత్‌ ఇంజనీర్ల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో ప్రస్తుతమున్న విద్యుత్‌ వాడకానికి రెట్టింపు స్థాయిలో కొనుగోలు ఒప్పందాలు కుదిరాయని... మళ్లీ కొత్తగా 6400 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి అనుమతించి, కొనుగోలు చేస్తే అమితమైన భారం పడుతుందని తెలిపాయి. 
 
గత ప్రభుత్వం పాతికేళ్ల వ్యవధికి కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుందంటూ తూర్పారబట్టిన జగన్‌... ఈ టెండర్లలో కొనుగోలు ఒప్పందాల వ్యవధిని ఏకంగా 30 ఏళ్లు చేశారు. టెండరుకు ప్రతిస్పందనగా ఐదు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. 
 
ఇందులో అదానీ గ్రూప్‌, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థలే దాదాపు 80 శాతం సామర్థ్యం మేరకు ప్లాంట్లను దక్కించుకున్నాయి. సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో ఏమాత్రం అనుభవం లేని షిర్డి సాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ వేల కోట్ల మెగావాట్ల మేర సౌర విద్యుత్‌ ఉత్పత్తికి ఎంపిక కావడం పారిశ్రామికవర్గాలను విస్మయపరిచింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు