రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ఫ్లాట్లలో ఏపీ ప్రభుత్వం రోడ్లు వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. రైతుల అంగీకారం లేకుండా ఏకపక్షంగా రోడ్లు వేయడం సరికాదన్న రైతుల వాదనను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది.
తాజాగా ఆ ఫ్లాట్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్ల నిర్మాణంపై వివాదం నెలకొంది. రాజధాని రైతుల ప్లాట్లలో ఏకపక్షంగా రోడ్డు పనులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు.
అమరావతికి భూసేకరణలో భూములిచ్చిన రైతులకు చెందిన నివాస స్థలాల్లో సీఆర్‌డీఏ, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
నిడమర్రు-బేతపూడి రోడ్డు పనులను వెంటనే నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. రైతులకు నోటీసులు ఇవ్వకుండా, వారి అనుమతి లేకుండా తమ ప్లాట్లలో రోడ్డు నిర్మాణం ఎలా చేపడతారని అధికారులను ఆమె ప్రశ్నించారు.
రోడ్ల నిర్మాణం చేపట్టాలంటే రైతులకు నోటీసులిచ్చి వారి వైఖరి తెలుసుకోవాలని స్పష్టం చేశారు. భూమిని సేకరించాలంటే సీఆర్‌డీఏ నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి రాజధాని కోసం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో 960 చదరపు గజాల నివాస స్థలాన్ని కేటాయించారంటూ అనపర్తి సునీత తరఫున ఆమె తండ్రి ఉప్పుటూరి శివనాగేశ్వరరావు సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు.