ఎయిడెడ్ పై చ‌ర్చ‌కు నో అన్న స్పీక‌ర్ - మండలి నుంచి టీడీపీ వాక్ అవుట్!

గురువారం, 18 నవంబరు 2021 (13:21 IST)
అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ అడుగ‌డుగునా అడ్డు త‌గులుతోంది. అసెంబ్లీ స‌మావేశాల‌లో టీడీపీ నేత‌ల‌కు సూది మొన అంత కూడా దూరే అవ‌కాశం ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతోంది. దీనితో టీడీపీ ప్ర‌జాప్ర‌తిధులు నిర‌స‌న తెలుపుతున్నారు. 
 
 
అమరావతిలో ఏపీ శాసన మండలి నుంచి టీడీపీ వాక్‌ అవుట్ చేసింది. గురువారం ఉదయం మండలి సమావేశాలు ప్రారంభం కావ‌డంతోనే, టీడీపీ స‌భ్యులు తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ జరగాలని పట్టుబట్టారు. మండ‌లి సభలో నిరసనకు దిగారు. ఎయిడెడ్ విద్యా సంస్థల సమస్యపై చర్చించాలని టీడీపీ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన వాయిదా తీర్మానాలను చైర్మన్  తిర‌స్క‌రించారు. ఇందుకు నిరసనగా సభ నుంచి టీడీపీ వాక్ అవుట్ చేసింది.
 
 
మ‌రో ప‌క్క ఇటు అసెంబ్లీ ప్రారంభానికి ముందు టీడీపీ నేత‌లు అసెంబ్లీ వెలుప‌ల నిర‌స‌న‌లు తెలిపారు. ఏపీలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ, తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు. ప్రజలకు భారంగా మారిన పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించాలని, చెత్తపై పన్ను వంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
 
 ప్లకార్డులు ప్రదర్శించారు. వైకాపా పాలనలో సామాన్య ప్ర‌జ‌లు చితికిపోతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ట్రూ అప్ ఛార్జీల పేరిట రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు పెంచి వేధిస్తున్నార‌ని, ఇక్క‌డ ఉన్న‌ట్లు అధికంగా క‌రెంటు ఛార్జీలు ఎక్క‌డా లేవ‌ని ఆయన ఆరోపించారు. వెంకటపాలెంలో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌కు చేరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు